
రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) వేగవంతం చేసింది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఇ-లాటరీ ప్రక్రియ ద్వారా 16 యూనిట్ల పరిధిలోని రైతులకు మొత్తం 115 ప్లాట్లను అధికారులు కేటాయించారు. నిబంధనల మేరకు అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి 145 ప్లాట్ల కేటాయింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, కొన్ని సాంకేతిక కారణాలు మరియు లేఅవుట్ల పరిశీలన అనంతరం 30 మంది రైతులు తమ కేటాయింపులను వాయిదా వేయాలని కోరారు. గురువారం సాయంత్రం 15 మంది, శుక్రవారం క్షేత్రస్థాయిలో లేఅవుట్‌ను పరిశీలించిన తర్వాత మరో 15 మంది రైతులు విన్నవించడంతో వారిని మినహాయించి మిగిలిన 115 ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు.
అపోహలు వద్దు.. అన్నీ అభివృద్ధి చేసిన ప్లాట్లే
ప్లాట్ల కేటాయింపుపై వస్తున్న పుకార్లను సీఆర్డీఏ అధికారులు తోసిపుచ్చారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఎక్కడా 'రోడ్డు శూల' (రోడ్ కట్) లేదని స్పష్టం చేశారు. దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లను రోడ్డు శూలగా పరిగణించలేమని గతంలోనూ ఇదే విధానం అనుసరించామని తెలిపారు. అదేవిధంగా పల్లపు ప్రాంతాలు (సమాధుల సమీపంలో ప్లాట్లు) ఉన్నాయనేవి కేవలం అపోహలు మాత్రమేనని లేఅవుట్ నిబంధనల ప్రకారం ప్రతి ప్లాట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రైతులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పూలింగ్‌కు భూమి ఇవ్వని వారి స్థలాల్లో ప్లాట్ల కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు.
గ్రామాల వారీగా కేటాయింపుల వివరాలు
ఈ విడతలో నిడమర్రు (1 & 2) గ్రామాలకు అత్యధికంగా 58 ప్లాట్లు దక్కాయి. మందడం (1, 2) గ్రామాలకు 15, వెలగపూడి మరియు మల్కాపురం గ్రామాలకు చెరో 10 చొప్పున కేటాయించారు. మిగిలిన వాటిలో పెనుమాక, లింగాయపాలెంలకు చెరో 6, కురగల్లు (1, 2)కు 5, నేలపాడుకు 2 ప్లాట్లు దక్కగా.. నెక్కల్లు, అనంతవరం, దొండపాడు గ్రామాలకు ఒక్కో ప్లాట్ చొప్పున కేటాయింపులు జరిగాయి.
రెండో దశ పూలింగ్‌కు సన్నాహాలు
అమరావతి ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 29 గ్రామాల నుంచి 29,881 మంది రైతులు సుమారు 34,281 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద అందజేశారని అధికారులు గుర్తు చేశారు. ప్రభుత్వం సేకరించిన మొత్తం 54 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను మరింత విస్తరించేందుకు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించినట్లు సీఆర్డీఏ వెల్లడించింది.
