Let's talk: editor@tmv.in
రాజధాని పేరుతో మరో కేంద్రీకరణా? ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచిన అసలు ప్రశ్న

రాజధాని పేరుతో మరో కేంద్రీకరణా? ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచిన అసలు ప్రశ్న

Dantu Vijaya Lakshmi Prasanna
8 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం మరోసారి వేడెక్కింది. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ రాజధాని దిశ మారుతుండటంతో ప్రజల్లోనే కాదు, నిపుణుల మధ్య కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి లక్ష ఎకరాల భూమి నిజంగా అవసరమా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. ప్రభుత్వం చేపడుతున్న రెండో దశ భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) ఈ సందేహాలను మరింత తీవ్రతరం చేస్తోంది.

ఇదేసమయంలో మరో మౌలిక ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఒకే ప్రాంతంలో ముఖ్యంగా అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతమైతే, మిగతా జిల్లాల భవితవ్యం ఏమవుతుంది? అనే ఆందోళన ప్రజల్లో బలపడుతోంది.

లక్ష ఎకరాల రాజధానా? లేక రియల్ ఎస్టేట్ మెగా ప్రాజెక్టా?

అమరావతి ప్రాజెక్ట్ ప్రతిపాదనలో భాగంగా సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పట్టణ ప్రణాళిక నిపుణులు, ఆర్థిక వేత్తలు ఈ అంచనాలపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా రాజధానిగా పనిచేయడానికి 4,000 నుంచి 10,000 ఎకరాల మధ్య విస్తీర్ణం సరిపోతుందన్నది అనేక నిపుణుల అభిప్రాయం.

సింగపూర్, పుత్రజయా, దుబాయ్ వంటి ప్రణాళిక నగరాలు కూడా పరిమిత విస్తీర్ణంలోనే సమర్థంగా అభివృద్ధి చెందాయి. లక్ష ఎకరాల ప్రాజెక్ట్ అనేది కేవలం పరిపాలనా రాజధాని కాదు, అది రియల్ ఎస్టేట్ ఆధారిత మెగా అభివృద్ధి ప్రాజెక్ట్‌గా మారే ప్రమాదం ఉంది. అంత భారీ విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయడానికి దశాబ్దాలు పట్టడమే కాకుండా, రాష్ట్రంపై అపారమైన ఆర్థిక భారం పడే అవకాశముంది.

ఇదే సమయంలో, వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం నిపుణుల్లో మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అమరావతికే అన్నీ అయితే… జిల్లాల పరిస్థితి ఏమిటి?

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధానిని పొందలేకపోయింది. అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటూ ముఖ్యమంత్రి ఇటీవల లేఖ రాశారు. కానీ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే సమస్యలు రాజధానితో మాత్రమే పరిమితం కావు.

రాయలసీమ ప్రాంతం ఇంకా నీటి కొరత, పరిశ్రమల లేమి, ఉద్యోగ వలసలతో ఇబ్బందులు పడుతోంది. ఉత్తరాంధ్రలో పోర్టులు ఉన్నప్పటికీ వాటి పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రాలేదు. విశాఖపట్నం తప్ప మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి అసమానంగా ఉంది. దక్షిణ తీరాంధ్రలో కొంత పారిశ్రామిక పురోగతి కనిపిస్తున్నా, అది కొనసాగాలంటే రాష్ట్రస్థాయి దృష్టి అవసరం.

ఈ పరిస్థితుల్లో, లక్షల కోట్ల బడ్జెట్ ఒకే అమరావతికి మళ్లిస్తే, మిగతా జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు, రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ఫలితంగా ప్రాంతీయ అసమానతలు మరింత లోతుగా మారే అవకాశం ఉంది.

హైదరాబాద్ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నామా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే, హైదరాబాద్‌ను ఒక్కటే అభివృద్ధి కేంద్రంగా మార్చడం. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, విద్యా, వైద్య సదుపాయాలు అన్నీ హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి.

విభజన సమయంలో అదే హైదరాబాద్ లేకుండా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఆ అనుభవం ఇంకా ప్రజల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు అమరావతిలోనే అన్నీ కేంద్రీకరిస్తే, అదే చరిత్ర తిరిగి పునరావృతమవుతుందా? అనే భయం సహజంగానే కలుగుతోంది.

ప్రపంచ స్థాయి రాజధాని – రాష్ట్ర స్థాయి భారం?

చంద్రబాబు నాయుడు దృష్టిలో అమరావతి “ప్రపంచ స్థాయి రాజధాని”. గ్లోబల్ గుర్తింపు, సింగపూర్ మోడల్, రింగ్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి, ఇవన్నీ ఆయన ఆలోచనల్లో ఉన్నాయి. కానీ నిపుణులు హెచ్చరిస్తున్న విషయం ఒక్కటే. రాష్ట్ర ఆర్థిక స్థోమతకు మించి వెళ్లే ప్రాజెక్టులు ప్రమాదకరం. అభివృద్ధి కోసం అప్పులు తప్పనిసరి కావొచ్చు. కానీ అవి సంపద సృష్టికి దారితీయకపోతే, భవిష్యత్తులో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది.

ప్రతిపక్షాల ఆరోపణలు – అప్పులపై మరో చర్చ

ప్రతిపక్షాలు మరింత గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. “అప్పులు చేయడంలో చంద్రబాబు ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టిస్తున్నారు. రాజధానికే నిధులన్నీ మళ్లిస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? సంపద సృష్టిస్తామంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పపై కూర్చోబెడుతున్నారా? శ్రీలంకలా ఆర్థిక సంక్షోభం ఎదురవుతుందా?” అనే ప్రశ్నలు రాజకీయంగా కాకుండా ప్రజాస్వామ్యంగా కూడా సమాధానం కోరుతున్నాయి. ఈ ఆరోపణలకు కూటమి ప్రభుత్వం మాటలతో కాదు, పనిచేసి చూపించడం ద్వారానే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.

సమతుల అభివృద్ధే ఆంధ్రప్రదేశ్‌కు మార్గం

ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం. కానీ అభివృద్ధి మాత్రం ఒకే నగరానికి పరిమితం కాకూడదు. అమరావతిని పరిపాలనా రాజధానిగా మితమైన విస్తీర్ణంలో అభివృద్ధి చేయడం, విశాఖపట్నాన్ని పరిశ్రమలు, పోర్టుల హబ్‌గా, తిరుపతిని విద్య, వైద్య, పర్యాటక కేంద్రంగా, రాయలసీమకు ప్రత్యేక పారిశ్రామిక బెల్టులు, ఉత్తరాంధ్రలో ఫిషరీస్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, ఇలాంటి పాలికేంద్ర అభివృద్ధి మోడల్ మాత్రమే రాష్ట్రానికి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

రాజధాని ఒకటి కావచ్చు. కానీ అభివృద్ధి కేంద్రాలు అనేకం కావాలి. ప్రతి జిల్లాకు ప్రాధాన్యం, ప్రతి ప్రాంతానికి అవకాశాలు, ప్రతి ప్రజకు సమానత్వం. ఇదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సరైన దారి. లక్ష ఎకరాల రాజధానా? లేక సమతుల అభివృద్ధా? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడే నిర్ణయించాలి. ఎందుకంటే, ఇది కేవలం రాజధాని నిర్ణయం కాదు. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయం.