
రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలి: ముఖ్యమంత్రి ఆదేశాలు
రాజధాని అమరావతిలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరుగుతున్న ఈ ఘటనలు సాధారణ ప్రమాదాలేనా? లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా? అనే దానిపై అన్ని కోణాల్లో విశ్లేషణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ప్రాంతంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై సీఎం అనుమానం వ్యక్తం చేస్తూ, ఘటనల వెనుక కుట్ర ఉండే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల తీరును పరిశీలించి లోతైన దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల రాయపూడి ప్రాంతంలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ స్థలంలో నిర్మాణ సంస్థకు చెందిన పైపులు అగ్నికి ఆహుతైన ఘటనపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక శకటాలతోపాటు పోలీసు సిబ్బంది మంటలను అదుపుచేశారు. వెలగపూడి సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన రూ.కోట్ల విలువైన హెచ్‌డీపీఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో బుగ్గి అయ్యాయి. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఆ దర్యాప్తు ముగియక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం
ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయం, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన సమయం, మంటలు వేగంగా వ్యాపించడానికి కారణాలపై సీఎం వివరాలు కోరారు.
అదేవిధంగా ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారంగా ఘటనకు కారణాలను ఖచ్చితంగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. ప్రతి అంశాన్ని సాంకేతికంగా విశ్లేషించి నిజానిజాలను వెలికి తీయాలని స్పష్టం చేశారు.
భద్రతపై కఠిన చర్యలు
రాజధాని ప్రాంతంలో భారీగా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కోట్ల రూపాయల విలువైన సామగ్రి నిల్వ ఉన్నట్లు సీఎం గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే అభివృద్ధి పనులకు అంతరాయం కలుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. నిర్మాణ ప్రాంతాల్లో అదనపు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలి. ప్రతి నిర్మాణ సంస్థ తమ యార్డుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సామగ్రి నిల్వ కేంద్రాల్లో ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఉండాలి. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ చేపట్టాలి. అంతేకాకుండా అనుమానితుల కదలికలపై నిఘా పెంచాలి అని అన్నారు.
ఈ ఘటనపై స్పందిస్తూ, ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించే ప్రయత్నం ఉన్నట్లు తేలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కుట్ర కోణంపై దృష్టి
వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని నివారించేందుకు పారదర్శక విచారణ అవసరమని సీఎం పేర్కొన్నారు. ప్రమాదాల వెనుక కుట్ర ఉంటే దానిని బహిర్గతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజధాని అభివృద్ధి వేగంగా కొనసాగుతున్న ఈ దశలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
