
రాజకీయ లాభాల కోసమే భాషా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు: అన్నామలై
కేంద్ర సెకండరీ విద్యా మండలి (సీబీఎస్ఈ) ప్రతిపాదించిన నూతన త్రిభాషా విధానం తమిళనాడులో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఈ విధానంపై అధికార డీఎంకే ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్కరణల పేరిట హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆరోపించగా ముఖ్యమంత్రి కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ త్రిభాషా సూత్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. భారతీయ భాషల ప్రోత్సాహం అనే నినాదంతో కేంద్రం హిందీకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఇది హిందీ మాట్లాడని రాష్ట్రాలను చిన్నచూపు చూడటమేనని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై అనవసరమైన అదనపు భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని కాపాడాలని రాష్ట్రాల హక్కులను గౌరవించాలని కోరిన ఆయన ఏఐఏడీఎంకే వంటి విపక్షాలు కూడా ఈ విషయంలో గొంతు కలపాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అన్నామలై ఖండించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఆరో తరగతి నుంచి బోధించే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న ఏ ప్రాంతీయ భాషనైనా ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుందని ఇందులో హిందీని బలవంతంగా అమలు చేస్తున్నారు అనడంలో అర్థం లేదని పేర్కొన్నారు. అసలు ఇందులో హిందీ రుద్దింపు ఎక్కడ ఉందో సీఎం నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రాథమిక దశలో మాతృభాషకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోందని అన్నామలై గుర్తు చేశారు. విమర్శలు చేసే ముందు సీఎం తన కుమార్తె చదువుతున్న పాఠశాలలోని పరిస్థితులను గమనించాలని అదేవిధంగా తమిళనాడులో సీబీఎస్ఈ పాఠశాలలు నిర్వహిస్తున్న డీఎంకే నేతలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భాషా సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో త్రిభాషా సూత్రం కేవలం విద్యాపరమైన మార్పుగా మిగిలిపోతుందా లేక పెద్ద రాజకీయ ఉద్యమానికి దారితీస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
