
రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంకోర్టు నోటీసులు
రాజకీయ పార్టీలకు రూ.2,000 లోపు అజ్ఞాత నగదు విరాళాలు ఇచ్చేందుకు ఆదాయపు పన్ను చట్టం అనుమతిచ్చే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, ఎన్నికల సంఘం తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిబంధన ఇదేనని పిటిషన్‌లో పేర్కొంది. జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెహతా బెంచ్ నాలుగు వారాల్లో స్పందన ఇవ్వాలని కేంద్రం, ఈసీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు నోటీసులు ఇచ్చింది.
హైకోర్టుకు ఎందుకు రాలేదు?
మొదటగా పిటిషనర్ ఖేమ్ సింగ్ భాటి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా, న్యాయవాది స్నేహ కలితను హైకోర్టుకు ఎందుకు రాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. వాదనల ప్రారంభంలోనే పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాదులను బెంచ్ విచారించింది. ఈ విషయం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకూ సంబంధించిందని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం బెంచ్ విచారణకు అంగీకరించింది.
పిటిషనర్ ఏం కోరారు?
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 13ఏలోని క్లాజ్ (డీ)ని రాజ్యాంగ విరుద్ధమని దీన్ని కొట్టివేయాలని, ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 2024లో ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించాలని పిటిషన్ కోరింది. ఎన్నికల గుర్తు, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం షరతుగా ఏ రాజకీయ పార్టీ కూడా నగదు విరాళాలు స్వీకరించకూడదని ఎన్నికల సంఘం నిబంధన విధించాలన్న డిమాండ్. అలాగే పార్టీల ఫాం 24ఏ రిపోర్టులను ఈసీ సమగ్రంగా పరిశీలించాలని కోరింది. పాన్/చిరునామా లేని విరాళాలను పార్టీలు ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించాలని కోరారు. నిబంధనలు పాటించని పార్టీల గుర్తు నిలిపివేయడం లేదా రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత 5 ఏళ్లలో పార్టీ ఆదాయపన్ను రిటర్నులు, ఆడిట్ రిపోర్టులను పరిశీలించి పన్ను, పెనాల్టీ, ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఎందుకంత ఆవశ్యకత?
పిటిషనర్ ఖేం సింగ్ భార్తీ వాదన ప్రకారం ఓటర్‌కు ఉన్న సమాచారం పొందే హక్కును సెక్షన్ 13ఏ(డీ) భంగపరుస్తోంది. దీని వల్ల రూ.2,000 లోపు నగదు విరాళాల పేరు, వివరాలు అవసరం లేకపోవడం వల్ల నల్లధనం ప్రవాహానికి మార్గం కలుగుతోంది. 2024లో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్‌లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు విరాళాల చట్టంలో ఉన్న లోపాలు ఇంకా కొనసాగడం అన్యాయమని చెబుతున్నారు. దేశంలో యూపీఐ, డిజిటల్ పేమెంట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నగదు మినహాయింపునకు ప్రయోగాత్మకత లేదన్నారు. పారదర్శకతకు ఇది పూర్తిగా విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కోన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై 2024, 2025లో కొన్ని పార్టీలు అసంపూర్ణ వివరాలు ఇచ్చినట్లుగా పిటిషన్ ఆరోపించింది. దీనివల్ల ఎన్నికలలో మనోభావాలతో కూడిన ఆర్థిక ప్రభావం ఉందని వాదించింది.
