Let's talk: editor@tmv.in
రాజకీయ కక్షతోనే నాపై తప్పుడు ఆరోపణలు: సుల్తాన్‌పూర్ కోర్టులో రాహుల్ గాంధీ

రాజకీయ కక్షతోనే నాపై తప్పుడు ఆరోపణలు: సుల్తాన్‌పూర్ కోర్టులో రాహుల్ గాంధీ

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తూ, ఈ కేసు కేవలం తన వ్యక్తిగత ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.

కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి శుభమ్ వర్మ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ, తాను ఎవరినీ ఉద్దేశించి కించపరిచే లేదా గౌరవానికి భంగం కలిగించే పదాలను వాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తన వ్యాఖ్యలను వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా ఈ ఫిర్యాదును దాఖలు చేశారని ఆయన తన స్టేట్‌మెంట్‌లో కోర్టుకు వివరించారు.

కేసు నేపథ్యం:

ఈ వివాదం 2018 నాటిది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ఒక సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్‌పూర్ కోర్టులో పరువు నష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌‌షా ప్రతిష్టకు ఈ వ్యాఖ్యలు భంగం కలిగించాయని ఫిర్యాదుదారు వాదిస్తున్నారు.

గత ఐదేళ్లుగా ఈ కేసు విచారణ వివిధ దశల్లో కొనసాగుతోంది. 2023 డిసెంబర్‌లో హాజరుకాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేయగా, 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు వచ్చి లొంగిపోయి బెయిల్ పొందారు. క్రమంగా సాక్షుల విచారణ ముగియడంతో, సెక్షన్ 313 కింద నిందితుడి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియలో భాగంగా నేడు రాహుల్ హాజరుకావాల్సి వచ్చింది.

భారీ భద్రత - మద్దతు

రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా సుల్తాన్‌పూర్ కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాహుల్ కోర్టు నుంచి బయటకు రాగానే పెద్ద సంఖ్యలో గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలు 'సత్యమేవ జయతే' అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అందరికీ అభివాదం చేస్తూ చిరునవ్వుతో అక్కడి నుంచి లక్నోకు, ఆపై ఢిల్లీకి బయలుదేరారు.

రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. ఆ రోజున తన వాదనలకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలను రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీర్పు రాహుల్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.