
రాజకీయాల్లో మహిళలు సరికొత్త ఒరవడి సృష్టించాలి: రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు
రాష్ట్ర అభివృద్ధిలోనూ రాజకీయాల్లోనూ మహిళలు ఆదర్శవంతమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదా రాజు నేతృత్వంలోని నూతన కమిటీని అభినందిస్తూ ఈ బృందం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాలని నేతలు ఆకాంక్షించారు. కమిటీలో డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వంటి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి అదనపు బలమని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని నేతలు కొనియాడారు. పాశ్చాత్య స్త్రీవాద పోకడలకు బదులుగా భారతీయ సంస్కృతిలోని “ఏకాత్మత” సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ‘పంచ పరివర్తన’ లో భాగంగా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం, స్వదేశీ వస్తువులనే వాడటం వంటి అంశాలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా మహిళా మోర్చా అంటే కేవలం వంటలు, ముగ్గుల పోటీలకే పరిమితం కాకుండా పార్టీలోని అన్ని రాజకీయ కార్యక్రమాల్లోనూ క్రీడల్లోనూ క్రియాశీలకంగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు అడిగే స్థాయికి మహిళా నేతలు ఎదగాలని, అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని ఈ సమావేశం తీర్మానించింది.
