
రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ ఉండదు:ప్రధాని
రాజకీయాల్లో ఎప్పుడూ ఫుల్‌స్టాప్ ఉండదని, ప్రజాసేవకు ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య పదవీకాలం ముగించుకోనున్న రాజ్యసభ 59 మంది సభ్యులకు బుధవారం వీడ్కోలు పలుకుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బుధవారం జరిగిన ద్వైవార్షిక వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఇలాంటి సందర్భాలు పార్టీల మధ్య తేడాలను చెరిపేసి ఒకే భావనను కలిగిస్తాయని ప్రధాని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో మనం రాజకీయ భేదాలను దాటి ఒకే భావంతో ముందుకు సాగుతామని తెలిపారు.మరల సభకు రాని సభ్యులను ఉద్దేశించి రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ అనేది ఉండదు. మీ అనుభవం దేశానికి ఇంకా అవసరం. మీ సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని ధైర్యం ఇచ్చారు.
ప్రముఖ నేతలకు ప్రశంసలు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవే గౌడ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ నేతలు తమ జీవితంలో సగానికి పైగా పార్లమెంటరీ వ్యవహారాలకు అంకితం చేశారని, వారి కృషి కొత్త సభ్యులకు ఆదర్శమని చెప్పారు.
ఉప సభాపతికి కృతజ్ఞతలు
పదవీ విరమణ చేస్తున్న ఉప సభాపతి హరివంశ్ సేవలను మోడీ కొనియాడారు. మృదుస్వభావి అయినప్పటికీ కార్యాచరణలో కఠినంగా పనిచేసే నాయకుడని అభివర్ణించారు. సభ విరామ సమయంలో కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువతతో మమేకమవుతున్నారని పేర్కొన్నారు.
హాస్య చతురత తగ్గిందని వ్యాఖ్య
ప్రస్తుత కాలంలో మీడియా ప్రభావం వల్ల సభలో హాస్యం, చమత్కారం తగ్గిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను ప్రస్తావిస్తూ ఆయన ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్‌ను ‘ఓపెన్ యూనివర్సిటీ’గా అభివర్ణించిన ప్రధాని, ఇక్కడ సభ్యులకు జాతీయ జీవితంపై విస్తృత అవగాహన కలుగుతుందని చెప్పారు. ఒక సభలో తీసుకున్న నిర్ణయాన్ని మరో సభ పరిశీలించడం సెకండ్ ఓపీనియన్‌లా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.
59 మంది సభ్యుల పదవీకాలం ముగింపు
సభాధ్యక్షుడు సి.పి. రాధాకృష్ణన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది సభ్యులు (ఇందులో 9 మంది మహిళలు) ఏప్రిల్-జూలై మధ్య పదవీ విరమణ చేయనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒక మూడో వంతు సభ్యులు రిటైర్ కావడం వల్ల సభలో నిరంతరత్వం కొనసాగుతూనే కొత్త సభ్యులకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
మాతో మోహబ్బత్ ,మోడీతో పెళ్లి : దేవే గౌడపై ఖర్గే సరదా వ్యాఖ్య
రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ అలసిపోరని, పదవీ విరమణ అనేది ఉండదని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజ్యసభలో పదవీకాలం ముగించుకుంటున్న సభ్యులకు వీడ్కోలు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఖర్గే, సరదాగా వ్యాఖ్యానించారు. ‘నాకు దేవేగౌడ 54 ఏళ్లుగా తెలుసు. చాలా కాలం కలిసి పనిచేశాం. కానీ తరువాత ఏమైందో తెలియదు… ‘మోహబ్బత్ మా తో చేశారు, పెళ్లి మాత్రం మోడీ సాహెబ్‌తో చేసుకున్నారు’అని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు
దేశ సేవపై ఉన్న అభిరుచి వల్ల రాజకీయాల్లో ఉన్నవారు అలసిపోరని, రిటైర్ కారని ఖర్గే అన్నారు. ప్రజాసేవకు అంకితభావమే నాయకులను ముందుకు నడిపిస్తుందని చెప్పారు.
రాజ్యసభకు కొత్త సభ్యులు
రాజ్యసభకు 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఎన్డీయే ఐదు స్థానాలను గెలుచుకుంది. అలాగే ఒడిశా, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా పలువురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కాంగ్రెస్‌తో ‘వివాహం’ కాదు… ‘విడాకులు’: దేవేగౌడ కౌంటర్
హెచ్.డి. దేవేగౌడ కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో తన సంబంధాన్ని ‘బలవంతపు వివాహం’గా అభివర్ణిస్తూ, అది హింసాత్మక సంబంధం కావడంతో ‘విడాకులు’ తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ దేవేగౌడ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే తనపై ప్రేమ కాంగ్రెస్‌తో, పెళ్లి బీజేపీతో అని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అదే శైలిలో తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. 2018 కర్ణాటక రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ, ఖర్గేను ముఖ్యమంత్రిగా చేయాలని తాను సూచించానని దేవేగౌడ చెప్పారు. అయితే గులాం నబీ ఆజాద్ జేడీఎస్ నాయకుడు హెచ్.డి. కుమారస్వామి నాయకత్వాన్ని ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీగా పార్టీ మారారని, దీనిపై కాంగ్రెస్ కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. మేము కాంగ్రెస్‌ను విడిచిపెట్టలేదు… వారే మమ్మల్ని వదిలేశారని దేవేగౌడ స్పష్టం చేశారు.
