
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాలు 4 శాతం పెరుగుదల
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మహిళలపై నమోదైన మొత్తం నేరాలు గత ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరిగినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు వెల్లడించారు. అయితే అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రం 25 శాతం తగ్గుదల కనిపించడం గమనార్హమని ఆయన తెలిపారు.
ఈ ఏడాది మహిళల అపహరణ కేసులు గణనీయంగా పెరిగాయి. 2024లో 233 కేసులు నమోదవ్వగా, 2025లో అవి 479కు చేరాయని. అలాగే లైంగిక వేధింపుల కేసులు 561 నుంచి 809కు పెరిగాయని, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద 2024లో 392 కేసులు ఉండగా, ఈ ఏడాది 516 కేసులు నమోదు అయ్యాయని కమిషనర్ వివరించారు.
అయితే, అత్యాచారం, మహిళల హత్య, గృహహింస, వరకట్న వేధింపులు, వరకట్న మరణాలు వంటి తీవ్రమైన నేరాల్లో 25 శాతం తగ్గుదల నమోదైందని. 2024లో ఈ కేటగిరీకి చెందిన 1,704 కేసులు ఉండగా, 2025లో అవి 1,194కు తగ్గినట్లు కమిషనర్ వివరించారు.
ఈ ఏడాది మొత్తం 26,852 నేరాలు నమోదు కాగా, వాటిలో 21,056 కేసులను పరిష్కరించడంతో 78 శాతం కేసుల పరిష్కార రేటు సాధించామని తెలిపారు. అలాగే 4,121 నాన్-బైలబుల్ వారెంట్లను అమలు చేసి ‘జీరో ఎన్‌బీడబ్ల్యూ’ స్థితిని సాధించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని అన్నారు.
సంఘటిత నేరాలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని, మత్తు పదార్థాల కేసుల్లో రూ. 20.01 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని 495 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అంతర్రాష్ట్ర బాలల అక్రమ రవాణా, అక్రమ అవయవాల వ్యాపార గ్యాంగులను ఛేదించి 16 శిశువులను రక్షించినట్లు వెల్లడించారు.
కనిపించే పోలీసింగ్, వేగవంతమైన స్పందన, అనుమానితుల పర్యవేక్షణ కారణంగా ఆస్తి సంబంధ నేరాలు 15 శాతం తగ్గాయని, సైబర్ నేరాలు కూడా 19.4 శాతం తగ్గి 3,734కు పరిమితమయ్యాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్లలో రాచకొండ ఒకటిగా కొనసాగుతోంది.
