Let's talk: editor@tmv.in
రాఘవ్ చద్ధాపై ఆప్ వేటు: బీజేపీలో చెరతారనే ఊహాగానాలు

రాఘవ్ చద్ధాపై ఆప్ వేటు: బీజేపీలో చెరతారనే ఊహాగానాలు

Dantu Vijaya Lakshmi Prasanna
4 ఏప్రిల్, 2026

ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంటూ రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుండి రాఘవ్ చద్ధాను తొలగించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ లేఖ రాసింది. ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన మరో ఎంపీ అశోక్ మిట్టల్‌ను కొత్త ఉపనేతగా నియమించాలని ఆప్ ప్రతిపాదించింది.

కేవలం పదవి నుండి తొలగించడమే కాకుండా, సభలో పార్టీకి కేటాయించిన కోటా సమయం నుండి రాఘవ్ చద్ధాకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని కూడా ఆప్ లేఖలో కోరినట్లు సమాచారం. ఇది పార్టీలో ఆయన ప్రాధాన్యత గణనీయంగా తగ్గిందనే సంకేతాలను ఇస్తోంది.

రియాక్షన్‌గా వీడియో విడుదల

తొలగింపు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే రాఘవ్ చద్ధా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా తాను ఇప్పటివరకు చేపట్టిన పనులను, లేవనెత్తిన ప్రజా సమస్యలను ఆ వీడియోలో పొందుపరిచారు. తన పనితీరును ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది.

రాఘవ్ చద్ధా పంచుకున్న వీడియోలో మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం, డేటా ఎక్స్‌పైరీ సమస్యలు, భారత్‌లో పితృత్వ సెలవులను హక్కుగా గుర్తించడం, విమానాశ్రయాలలో అదనపు సామానుపై విధిస్తున్న ఛార్జీల వంటి కీలక అంశాలను ఆయన సభలో ప్రస్తావించిన దృశ్యాలు ఉన్నాయి.

ముఖ్య నేతగా ప్రస్థానం

ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎంపీలలో ఒకరిగా రాఘవ్ చద్ధా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో, ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

మారుతున్న సమీకరణాలు

రాఘవ్ చద్ధా వంటి కీలక నేతను హఠాత్తుగా పదవి నుండి తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అంతర్గత సమీకరణాలు మారుతున్నాయని, పంజాబ్ ఎంపీల మధ్య ప్రాధాన్యతలు మారుతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది. అశోక్ మిట్టల్ నియామకంతో సభలో పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

రాఘవ్ చద్ధా బీజేపీలో చేరికపై అతిశి అనుమానాలు

బీజేపీలో రాఘవ్ చద్ధా చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలు అతిశి స్పందించారు. బీజేపీకి ఒక ప్రత్యేకమైన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' ఉందంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరించడం లేదా రకరకాల ఆశలు చూపడం ద్వారా వారిని తమ పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి అలవాటేనని ఆమె పేర్కొన్నారు. చాలామంది నాయకులు ఈ భయం వల్లనో, ఒత్తిడి వల్లనో లేదా ప్రలోభాలకు లోనయ్యో తమ సొంత పార్టీలను వీడి బీజేపీలో చేరుతున్నారని అతిశి వ్యాఖ్యానించారు.

రాఘవ్ చద్ధా విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతూ ఉండవచ్చని అతిశి అనుమానం వ్యక్తం చేశారు. పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గడం, రాజ్యసభ ఉపనేత పదవి నుండి తొలగించిన తరుణంలో, బీజేపీ ఆయనపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చనే సంకేతాలను ఆమె ఇచ్చారు. గతంలో పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన చద్ధా, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలపై అతిశి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న నాయకుడు పార్టీ మారుతారా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.