Let's talk: editor@tmv.in
రాంబిల్లిలో 'బ్లూ జెట్' ఫార్మా యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

రాంబిల్లిలో 'బ్లూ జెట్' ఫార్మా యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

Panthagani Anusha
1 మార్చి, 2026

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలం పరిధిలోని సీతపాలెం వద్ద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ప్రముఖ ఫార్మా కంపెనీ 'బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్' ఏర్పాటుకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాంబిల్లి మండలంలోని సీతపాలెం ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న మంత్రికి కంపెనీ ప్రతినిధులు కూటమి నేతలు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు మంత్రి లోకేష్ భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడి రానుంది. రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌లో ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లు, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ తయారీ విభాగాలను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన సుమారు 1,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని.

కాగా ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బ్లూ జెట్ పరిశ్రమ కోసం కూటమి ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం మూడు దశల్లో ఈ ఫార్మా కంపెనీ నిర్మాణం పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్-చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.