
రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు
ఎన్నికల ప్రక్రియలో వస్తున్న అవకతవకలను తొలగించడానికే ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తీసుకువచ్చిందని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈసీ పని చేస్తుందని, రాజ్యాంగబద్ధమైన సంస్థపై పదేపదే విమర్శలు చేయడం సరికాదన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతిసారి ‘సర్’ గురించి మాట్లాడుతారు. పదే,పదే ఓటరు జాబితాలోని అక్రమాలను గురించి చెబుతుంటారు. వాటిని సరి చేయడానికే సర్ ను తీసుకొచ్చారని, మీరే అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తారు. మళ్లీ సవరణ చేస్తున్నారని ఆరోపిస్తారు. సమస్యను పరిష్కరిస్తే మీకు ఏదో సమస్య వస్తుందనే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ కేవలం ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు.
అణుబాంబా? హైడ్రోజన్ బాంబా?
ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఙానేశ్ కుమార్ పై లేనిపోని ఆరోపణలు చేశారు. ఓటు దొంగలను రక్షిస్తున్నారని మాట్లాడారు. అలాగే మహదేవ్ పుర నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని చూపించి ఇది అణుబాంబు అని, ప్రస్తుతం హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తానని లేనిపోని కబుర్లు చెబుతున్నారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ వేసే బాంబు పేలినప్పుడే ఆది అణుబాంబా? హైడ్రోజన్ బాంబా అని తెలిసేది అని చురకలంటించారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు
ఓటర్ జాబితాలో ఏ విధంగా నకిలీ ఓటర్లను చేర్చారో, ఉన్న ఓటర్లను ఏ విధంగా తొలగించారన్నది రాహుల్ గాంధీ ఇంతకుముందే వివరించారు. ఇందుకు ప్రధానంగా ఈసీనే సహకరిస్తుందని విమర్శలు చేశారు. ఓట్ చోరీకి పాల్పడుతున్న వారిని కమిషనర్ జ్ఙానేశ్ కుమార్ రక్షిస్తున్నారని ఆరోపించారు. తన వద్ద రుజువులున్నాయని రాహుల్ తెలిపారు. అలాగే కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6 వేల ఓటర్లను తొలగించారని వివరించారు.
