Let's talk: editor@tmv.in
రహదారి నిర్మాణంలో 'ఏపీ' రికార్డుల జోరు

రహదారి నిర్మాణంలో 'ఏపీ' రికార్డుల జోరు

Panthagani Anusha
13 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు,కడప,విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అసాధారణ వేగాన్ని ప్రదర్శించి, కేవలం వారం రోజుల వ్యవధిలోనే నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో జరిగిన ఈ పనులు భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పాయి. ఈ చారిత్రాత్మక విజయంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అత్యాధునిక సాంకేతికత కఠినమైన నాణ్యత ప్రమాణాల కలయికే ఈ విజయానికి మూలమని కొనియాడారు.

ఇక రికార్డుల పరంపరను పరిశీలిస్తే జనవరి 6వ తేదీన కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 29 లేన్ కిలోమీటర్ల మేర రహదారి పేవింగ్ పూర్తి చేయడం ద్వారా తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. అదే ఉత్సాహంతో, ఒకే రోజులో 10,600 టన్నులకు పైగా బిటుమినస్ కాంక్రీట్‌ను వినియోగించి రెండో రికార్డును సాధించారు. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి పనులు పూర్తి చేయడం దేశ మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. అధికారుల సమన్వయం కార్మికుల నిరంతర శ్రమ ఈ అద్భుతానికి బాటలు వేశాయి.

ఈ విజయ యాత్ర అక్కడితో ఆగలేదు. జనవరి 5 నుంచి 11 మధ్య వారం రోజుల కాలంలో ఏకంగా 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారి పనులు పూర్తి చేసి అంతకుముందున్న అంతర్జాతీయ రికార్డును ఎన్‌హెచ్‌ఏఐ తిరగరాసింది. నాలుగో రికార్డుగా అదే వారంలో విరామం లేకుండా 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం అత్యాధునిక హాట్ మిక్స్ ప్లాంట్లు, హైస్పీడ్ పేవర్స్ రియల్‌టైమ్ డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలను వినియోగించడం విశేషం.

మొత్తం 343 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ ఆరు లేన్ల ఎకనామిక్ కారిడార్ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు వల్ల బెంగళూరు–విజయవాడ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు, దూరం సుమారు 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఈ మార్గంలో 5.3 కిలోమీటర్ల సొరంగ మార్గం, అటవీ ప్రాంతం గుండా ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని తీర ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడం ద్వారా ఈ రహదారి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ఊపునివ్వనుంది. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడంలో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.