Let's talk: editor@tmv.in
రహదారులకు కొత్త సవాళ్లు

రహదారులకు కొత్త సవాళ్లు

FL - TRND
26 సెప్టెంబర్, 2025

ఈ ఏడాది వర్షాలు దేశానికి గట్టి హెచ్చరికగా మారాయి. సాధారణంగా వర్షాలు వస్తే కొంత నష్టం జరుగుతుంది కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. దేశంలో జాతీయ రహదారులు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు సంబంధించి ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాటిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 427 మంది మరణించడం అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చూపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 25 జాతీయ రహదారి భాగాలు దెబ్బతిన్నాయి. కులుమనాలి మార్గం, ఇండియా-టిబెట్ రహదారి, అలాగే యన్-305 లాంటి ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా 338 రహదారులు బ్లాక్ అయ్యాయి, అందులో 2 జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్తుల నష్టం మాత్రమే 4,861 కోట్ల రూపాయలు దాటింది. ఇది 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగిన కేదార్‌నాథ్ విపత్తు తర్వాత అతి పెద్ద మానవ ఆర్థిక నష్టం.

పంజాబ్‌లో 4,700 కిలోమీటర్ల రహదారి పొడవు, 68 వంతెనలు దెబ్బతిన్నాయి. దీని రిపైర్‌కు 1,970 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. జమ్ము-కశ్మీర్‌లో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అయిన శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి 2 రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో పండ్ల ఎగుమతులు ఆగిపోయి రైతులు నష్టపోయారు. ప్రధాన లింక్ అయిన NH-44 కూడా వరదలతో ధ్వంసమై మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గందరగోళం నెలకొంది. మొత్తం నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌కు 441.6 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అదనంగా 2,000 కోట్ల రూపాయలను రిపైర్ల కోసం ఆమోదించింది. జాతీయ రహదారి అథారిటీ కిరాత్‌పూర్-కులుమనాలి రహదారిపై తక్షణ సహాయం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించింది. వర్షాల ముందే అధికారులు ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్స్, డ్రోన్లు, ఎక్స్కవేటర్లు, ఇసుక సంచులు వంటి ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ విపత్తు ఆ ప్రయత్నాలన్నింటినీ తుడిచేసింది.

వాతావరణ మార్పుల కారణంగా భారీ వర్షాల శాతం గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఒక రోజులో కురిసిన వర్షపాతం సాధారణ కంటే 1,000శాతం ఎక్కువ నమోదైంది. నిజానికి రహదారి రూపకల్పన పాత వాతావరణ పరిస్థితులకు సరిపోయేలా మాత్రమే ఉంది. ఇప్పుడున్న వాతావరణానికి మాత్రం ఈ రోడ్లు పనికిరావని నిపుణులు చెబుతున్నారు. 2021 నుంచి 2024 వరకు ప్రభుత్వం జాతీయ రహదారి నిర్వహణ కోసం 17,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి ఏడాది సుమారు 6,000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. కానీ ఈ ఏడాది వర్షాలు తెచ్చిన నష్టం కొన్ని రాష్ట్రాల వార్షిక నిర్వహణ బడ్జెట్ కంటే ఎక్కువ. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కేంద్రాన్ని లక్షా 60 వేల కోట్ల సహాయక ప్యాకేజీ కోసం కోరింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఉత్తర రాష్ట్రాల మొత్తం ఆర్థిక నష్టం 15,000 కోట్ల రూపాయలు దాటింది. హిమాచల్, జమ్ము-కశ్మీర్ పర్యాటక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేసవి కాల పర్యాటకం రద్దవడంతో హోటళ్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీని కారణంగా కశ్మీర్ ఆపిల్ రైతులు, మనాలి హోటల్ వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు రవాణా శాఖ రహదారులను మరింత బలంగా నిర్మించడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. కాంక్రీట్ పూతలతో నిర్మాణాలు, కొండచరియలు పడకుండా ప్రత్యేక రక్షణ, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థలు, భూగర్భ సర్వేలపై దృష్టి పెట్టారు. ఇక ఈ ఏడాది వర్షాలు ఒక స్పష్టమైన పాఠం ఇచ్చాయి. దేశ రహదారులు వాతావరణ మార్పులకు త్వరగా సరిపోకపోతే ప్రతి సంవత్సరం ధ్వంసం, మరమ్మత్తు, మళ్లీ ధ్వంసం అనే చక్రం ఆగదు. రహదారులను వాతావరణ మార్పుల ప్రభావానికి రక్షణగా మార్చడం ఇప్పుడు అత్యవసరమని ప్రభుత్వాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే నష్టం,విధ్వంసం తప్పదండి!

రహదారులకు కొత్త సవాళ్లు - Tholi Paluku