
రసవత్తరంగా మారిన బెల్లంపల్లి రాజకీయం.. బీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు కౌన్సిలర్లు
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తదుపరి పరిణామాల్లో భాగంగా పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా.. శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తాజాగా ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు. కౌన్సిలర్లుకు కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి కూడా బీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించడం గమనార్హం. వీరి చేరికతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పెరిగింది. ఇదిలా ఉండగా, బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిశారు. ఆయన అధికారికంగా పార్టీలో చేరకపోయినా, బీఆర్ఎస్ విధానాలు, అభివృద్ధి దృక్పథానికి ఆకర్షితులై పూర్తి స్థాయి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
ఈ మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలు ఉండగా కాంగ్రెస్‌కు 14, బీఆర్‌ఎస్‌కు 14, బీజేపీ 1, స్వతంత్రులకు 5, స్థానం దక్కాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 17కు చేరింది. ఛైర్మన్ పీఠంపై గురిపెట్టిన బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. రేపు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
