
రసవత్తరంగా జమ్మూ-కశ్మీర్ రాజ్యసభ ఎన్నికలు
జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ 2025 అక్టోబర్ 6న విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. అయితే తమకు అక్కడ బలం లేకపోయిన పార్టీలు అభ్యర్థులను బరిలో దించాయి. జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో 25 స్థానాలను జమ్మూ,కశ్మీర్ నేషనల్ కాన్పరెన్స్ గెలుచుకుంది. బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 11 నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకుంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ బలం చాటుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి రానందున కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులతో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి పదవులు తీసుకోనప్పటికీ కాంగ్రెస్ ఓమర్ అబ్దుల్లాకు మద్దతునిచ్చింది. అత్యధిక మెజార్టీ బీజేపీకి వచ్చినప్పటికీ ప్రతిపక్షంలో నిలిచింది. ఇదిలా ఉంటే 2021 కంటే ముందు ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్నాయి. చివరగా గులాం నబీ ఆజాద్, మీర్ మహ్మద్ ఫయాజ్, శంషేర్ సింగ్, నజీర్ అహ్మద్ లావే పదవీ విరమణ చేశారు. అయితే ఈసారి రాజ్యసభ ఎన్నికలు అక్టోబర్ 24న జరగనున్నాయి.
ఒక రాజ్యసభ స్థానానికి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం
ఆ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల ప్రకారం రాజ్యసభ స్థానాలను కేటాయిస్తారు. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 90 శాసనసభ స్థానాలున్నాయి. అయితే బీజేపీ మూడు స్థానాల్లో గెలవాలంటే 57 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఒక సీటు మాత్రమే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో సీటు కోసం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అవసరం ఉంటుంది. లేకుంటే క్రాస్ ఓటింగ్ జరిగితే తప్పా రెండో సీటు గెలవలేని పరిస్థితి. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పరిస్థితి కూడా కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో రెండు సీట్లు గెలవగలదు. కానీ మూడోసీటు గెలవలంటే ఇక్కడా క్రాస్ ఓటింగ్ పైనే ఆధారపడాల్సిందే. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలబడితే ఇతర పార్టీల సహకారం అవసరం ఉంటుంది. ఇక పీడీపీకి కూడా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే వీరూ స్వతంత్రులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు రెండో సీటు, లేదా మూడు సీటు గెలవాలంటే స్వతంత్రుల మద్దతు అత్యవసరం. కానీ వారు ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. బీజేపీ పీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడడం లేదు. ఇక మూడు స్థానాల్లో గెలవడమే గగనంగా మారిన తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాలుగో స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తామనడం ఆశ్చర్యంగా ఉంది.
ముగ్గురితో బీజేపీ జాబితా
త్వరలో జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ ప్రకటించిన జాబితాలో గులామ్ మహమ్మద్ మీర్, రాకేశ్ మహాజన్, సత్ పాల్ శర్మ ఉన్నారు.
అభ్యర్థుల వివరాలు
సత్ పాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ జమ్మూ-కాశ్మీర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మొదట 2015 నుంచి 2018 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం కూడా అదే పదవిలో ఉన్నారు. 2018లో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు.
రాకేశ్ మహాజన్ బీజేపీ రాష్ట్ర యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గులామ్ మహమ్మద్ మీర్ గత సంవత్సరం జరిగిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హాండ్‌వారా నియోజకవర్గం నుంచి పోటీచేసి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గనీ లోన్ చేతిలో ఓడిపోయారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బరిలో ముగ్గురు
జమ్మూ-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) కూడా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ నుంచి కూడా చౌధరి మహ్మద్ రమ్జాన్, సజ్జాద్ అహ్మద్ కిచ్లో, షమ్మీ ఓబెరాయ్ పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. నాలుగో స్థానానికి కూడా అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన సలహాదారు నాసిర్ అస్లాం వాని మాట్లాడుతూ మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాం. నాలుగో సీటుకు అభ్యర్థిని రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామన్నారు. అలాగే ఫారూక్ అబ్దుల్లా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఫారూక్ సాహబ్ ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన అనుభవం, మార్గదర్శనం ఇక్కడే అవసరమని మేము భావిస్తున్నాం అని ఈ సందర్భంగా వివరించారు.
