Let's talk: editor@tmv.in
రష్యా యూనివర్సిటీలో కలకలం.. భారత విద్యార్థులపై కత్తితో దాడి

రష్యా యూనివర్సిటీలో కలకలం.. భారత విద్యార్థులపై కత్తితో దాడి

Shaik Mohammad Shaffee
9 ఫిబ్రవరి, 2026

రష్యాలోని బాష్కార్టోస్థాన్ రిపబ్లిక్‌లో శనివారం ఘోర హింసాకాండ చోటుచేసుకుంది. ఉఫా నగరంలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి చొరబడిన ఒక ఉన్మాది విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు మైనర్ బాలుడు కావడం గమనార్హం.

అసలేం జరిగిందంటే?

శనివారం స్థానిక స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల హాస్టల్‌లోకి ఒక 15 ఏళ్ల బాలుడు కత్తితో ప్రవేశించాడు. అక్కడ ఉన్న విద్యార్థులపై ఒక్కసారిగా దాడికి దిగాడు. హాస్టల్ గదుల్లో ఉన్న విద్యార్థులను వెంబడించి మరీ పొడిచాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులపై కూడా అతడు దాడి చేయగా, వారికి కత్తిపోట్లు తగిలాయి. అనంతరం సదరు నిందితుడు తనను తాను కూడా గాయపరుచుకున్నట్లు రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఐరినా వోల్క్ వెల్లడించారు.

క్షతగాత్రుల పరిస్థితి విషమం

ఈ దాడిలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. నిందితుడైన 15 ఏళ్ల బాలుడిని కూడా తీవ్ర గాయాలతో చిన్నారుల ఆసుపత్రిలో చేర్చారు.

జాతి వివక్షే కారణమా?

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇది వ్యక్తిగత కక్షతో చేసిన దాడి కాదని, ఒక నిషిద్ధ నయా నాజీ సంస్థ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు 'నేషనల్‌ సోషలిజం/వైట్‌ పవర్‌' అనే నిషేధిత నయా నాజీ సంస్థకు చెందినవాడని, దాడి చేసే సమయంలో అతడు హోలోకాస్ట్ కు సంబంధించిన జాతీయవాద నినాదాలు చేశాడని 'బాజా' టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. ఘటనా స్థలంలో బాధితుల రక్తంతో గోడలపై స్వస్తిక గుర్తులను గీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇది స్పష్టంగా జాతి వివక్షతో కూడిన దాడిగానే కనిపిస్తోంది.

రంగంలోకి భారత రాయబార కార్యాలయం

ఈ ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి కజాన్ నుంచి అధికారుల బృందాన్ని ఉఫాకు పంపినట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.