Let's talk: editor@tmv.in
రష్యా చమురు కొనుగోలుకు ఇతర దేశాలకూ అమెరికా గ్రీన్ సిగ్నల్

రష్యా చమురు కొనుగోలుకు ఇతర దేశాలకూ అమెరికా గ్రీన్ సిగ్నల్

Shaik Mohammad Shaffee
14 మార్చి, 2026

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది. ఇరాన్‌తో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడంతో, ఇంధన ధరలను అదుపు చేసేందుకు భారత్‌కు ఇచ్చిన తరహాలోనే ఈ మినహాయింపును ఇతర దేశాలకూ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్ బాటలోనే మరికొన్ని దేశాలు

గత నెల ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మార్చి 5న భారత్‌కు 30 రోజుల పాటు రష్యా చమురు కొనుగోలుకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గతంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు ఇచ్చిన వెసులుబాటును ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించాలని వైట్ హౌస్ నిర్ణయించింది.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరీకరణే లక్ష్యం

గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇరాన్ పాలన వల్ల తలెత్తిన అస్థిరతను ఎదుర్కొంటూనే, వినియోగదారులపై భారం పడకుండా ధరలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సముద్రంలో రవాణాలో ఉండిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు మాత్రమే ఈ తాత్కాలిక అనుమతి వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రష్యాకు పెద్దగా ఒరిగేదేమీ లేదు!

ఈ స్వల్పకాలిక మినహాయింపు వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని బెసెంట్ విశ్లేషించారు. రష్యాకు వచ్చే ఇంధన ఆదాయం ప్రధానంగా చమురు వెలికితీత సమయంలో విధించే పన్నుల ద్వారానే లభిస్తుందని, ప్రస్తుతం రవాణాలో ఉన్న చమురు విక్రయాల వల్ల ఆ దేశానికి అదనపు లాభం తక్కువని పేర్కొన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న అనుకూల ఇంధన విధానాల వల్ల అమెరికాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని, ప్రస్తుతం పెరుగుతున్న ధరలు తాత్కాలికమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆయన వివరించారు.