Let's talk: editor@tmv.in
రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షల ప్రభావం: ఐఇఏ నివేదిక

రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షల ప్రభావం: ఐఇఏ నివేదిక

Dantu Vijaya Lakshmi Prasanna
13 డిసెంబర్, 2025

అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం, నవంబర్ నెలలో రష్యా చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం, అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల వల్ల కొనుగోలుదారులు (ముఖ్యంగా భారతీయ రిఫైనరీలు) ప్రమాదాల గురించి భయపడటం, జాగ్రత్త వహించడం.

నవంబర్‌లో రష్యా మొత్తం చమురు ఎగుమతులు రోజుకు 420 వేల బ్యారెల్స్ మేర తగ్గి, 6.9 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కి చేరుకున్నాయి. ఎగుమతులు తగ్గడం, ధరలు పడిపోవడంతో రష్యా చమురు ఆదాయం 11 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది ఏడాది క్రితం కంటే 3.6 బిలియన్ డాలర్లు తక్కువ. రష్యా ముఖ్యమైన ముడి చమురు రకం యురల్స్ ధర బ్యారెల్‌కు $8.2 తగ్గి, $43.52 కి పడిపోయింది. ఇది 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అత్యల్పం.

భారత్‌పై ప్రభావం:

రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు గాను, భారతీయ దిగుమతులపై అమెరికా అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. ఈ ఆంక్షల వల్ల భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించుకుంటున్నాయి. నవంబర్‌లో ప్రపంచ చమురు సరఫరా కూడా 610 వేల బ్యారెల్స్ తగ్గింది. ఈ తగ్గుదలలో OPEC+ దేశాల వాటానే ఎక్కువ. రష్యా వెనిజులాలో సరఫరా సమస్యలు దీనికి ప్రధాన కారణం. అయినప్పటికీ, 2025లో ప్రపంచ చమురు సరఫరా 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే 2026లో మరో 2.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది. అలాగే, మెరుగైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రపంచ చమురు డిమాండ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.