
రష్యా చమురుకు భారత్ గుడ్ బై.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందాన్ని వైట్‌హౌస్ ప్రశంసించింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని, బదులుగా అమెరికా, అవసరమైతే వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తామని అంగీకరించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అంతేకాకుండా అమెరికాలో కీలక రంగాల్లో 500 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.41.7 లక్షల కోట్లు) పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని కూడా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలైన్ లెవిట్ తెలిపారు.
ట్రంప్–మోడీ మధ్య నేరుగా చర్చలు
మంగళవారం మీడియాతో మాట్లాడిన లెవిట్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఈ కీలక వాణిజ్య ఒప్పందం కుదిరిందన్నారు. ట్రంప్‌కు మోడీతో అత్యంత సన్నిహిత సంబంధం ఉందని, ఆయనపై గౌరవం ఉందని చెప్పారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు.
అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు
ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని, అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని లెవిట్ తెలిపారు. అవసరమైతే వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. వెనిజులా చమురు వ్యాపారాన్ని ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం నియంత్రిస్తోందని, దీని వల్ల అమెరికాకు లాభం చేకూరుతుందని వివరించారు.
అమెరికాలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
అదనంగా భారత్ అమెరికాలో రవాణా, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తులు తదితర రంగాల్లో మొత్తం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అంగీకరించిందని లెవిట్ తెలిపారు. ఇది అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యల ఫలితమని ఆమె వ్యాఖ్యానించారు.
టారిఫ్‌లలో కీలక మార్పులు
ఈ ఒప్పందంతో భారత్‌పై అమెరికా విధించే సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని, అయితే అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే ఎగుమతులపై మాత్రం సున్నా శాతం టారిఫ్ మాత్రమే ఉంటుందని లెవిట్ చెప్పారు. దీంతో ఇది అమెరికా కార్మికులు, వ్యాపారులు, వినియోగదారులకు భారీ విజయమని పేర్కొన్నారు. అంతకుముందు ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. ఇందులో రష్యా చమురు కొనుగోళ్లపై 25 శాతం సుంకం కూడా ఉంది.
ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ప్రకటన
సోమవారం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేస్తూ, భారత్‌పై విధించిన పరస్పర టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అమెరికాపై భారత్ విధించే టారిఫ్‌లు, నాన్-టారిఫ్ అడ్డంకులను ‘సున్నా’కి తగ్గించేందుకు భారత్ ముందుకు వచ్చిందని తెలిపారు. ‘బై అమెరికన్’ విధానంలో భాగంగా భారత్ 500 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర వస్తువులు కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు.
ప్రధాని మోడీ స్పందన
ఈ ఒప్పందంపై ప్రధాని మోడీ స్పందిస్తూ, తన ‘ప్రియ మిత్రుడు’ ట్రంప్‌తో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం
రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మోడీ అన్నారు. ట్రంప్ నాయకత్వం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి కీలకమని పేర్కొన్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
చమురు నిలిపివేతపై మాకు సమాచారం లేదు: రష్యా
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందన్న అమెరికా ప్రకటనపై క్రెమ్లిన్ స్పందించింది. న్యూఢిల్లీ నుంచి తమకు ఇప్పటివరకు అలాంటి అధికారిక సమాచారం అందలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని, ప్రపంచవ్యాప్తంగా రష్యా ఇంధన వనరులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు, 2022 తర్వాత రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికా చేస్తున్న ప్రకటనలపై రష్యా ఇంధన శాఖ నిశితంగా నిఘా ఉంచింది.
