Let's talk: editor@tmv.in
రష్యాలో రెండు కొత్త భారత కాన్సులేట్‌లను ప్రారంభించిన జైశంకర్‌

రష్యాలో రెండు కొత్త భారత కాన్సులేట్‌లను ప్రారంభించిన జైశంకర్‌

Shaik Mohammad Shaffee
20 నవంబర్, 2025

రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం రెండు కొత్త భారత కాన్సులేట్‌లను ప్రారంభించారు. ఈ కొత్త కాన్సులేట్‌ల ఏర్పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, విద్యా, సాంస్కృతిక సంబంధాలను పెంచుతుందని ఆయన అన్నారు. రష్యాలో తన దౌత్య కార్యకలాపాల పరిధిని విస్తరిస్తూ, భారతదేశం యెకాటెరిన్‌బర్గ్, కజాన్ నగరాలలో కొత్త కాన్సులేట్ జనరల్‌లను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో, రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

"రష్యన్ ఫెడరేషన్‌లో భారతదేశ దౌత్య చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు" అని జైశంకర్ అన్నారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో తాను దౌత్య బాధ్యతలు నిర్వహించిన రోజులను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "ఈ దేశంలో రెండు కొత్త కాన్సులేట్ జనరల్స్‌ను ఏర్పాటు చేస్తున్నందున ఇది మనకు ఒక ముఖ్యమైన రోజు. గత కొద్ది నెలలుగా వీటి ఏర్పాటు కోసం సుదీర్ఘంగా కృషి కొనసాగింది" అని ఆయన పేర్కొన్నారు. రష్యా ప్రభుత్వ సహకారాన్ని భారత్ గుర్తిస్తున్నదని ఆయన వెల్లడించారు.

జైశంకర్ మాట్లాడుతూ, యెకటెరిన్‌బర్గ్‌ను దాని పారిశ్రామిక ప్రాముఖ్యత వల్ల రష్యా మూడో రాజధానిగా పిలుస్తారని, ఇది సైబీరియాకు ప్రవేశ ద్వారం అని అన్నారు. ఇది హెవీ ఇంజనీరింగ్, రత్న తయారీ, రక్షణ ఉత్పత్తి, లోహ పరిశ్రమ, అణు ఇంధనం, రసాయనాలు, వైద్య పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిందని వివరించారు. “ఈ కాన్సులేట్ ప్రారంభం భారత, రష్యా పరిశ్రమల మధ్య సాంకేతిక, శాస్త్రీయ, ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని తెలిపారు.

కజాన్ నగరం రష్యాలో అత్యధికంగా సందర్శించబడే నగరాల్లో ఒకటి. 2024 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకూ ఇది ఆతిథ్యం ఇచ్చింది. ఆ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతం బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సమ్మేళనంగా ఉండి, రష్యా-ఆసియా మధ్య వారధిగా వ్యవహరిస్తుందని జైశంకర్ అన్నారు. ఈ కాన్సులేట్ ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయటంలో, సాంస్కృతిక మార్పిడులను పెంపొందించటంలో, అలాగే ఐటెక్ కార్యక్రమాల్లో పాల్గొనడంలో సహాయపడుతుందని చెప్పారు. కజాన్ చమురు ఉత్పత్తి, రిఫైనరీలు, ఎరువులు, ఆటోమొబైల్ తయారీ, రక్షణ రంగ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో ప్రఖ్యాతి గాంచిందని జైశంకర్ వివరించారు.

ఈ రెండు కొత్త కాన్సులేట్ల ప్రారంభంతో భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ఈ కాన్సులేట్లు భారత దౌత్య ఉనికిని పెంచడమే కాకుండా, వాణిజ్యాన్ని ప్రోత్సహించటానికి, పర్యాటకాన్ని పెంచటానికి, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, విద్యా, సాంస్కృతిక బంధాలను బలపరచటానికి ప్రేరణనిచ్చే సాధనాలుగా పనిచేస్తాయని జైశంకర్ తెలిపారు. “మన నాయకులు నిర్ణయించినట్లుగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచే ప్రయత్నాల్లో ఈ కాన్సులేట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి” అని అన్నారు.

జూలై 2024లో భారత్–రష్యా 2030 నాటికి వార్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని నిర్ణయించాయి. రెండు దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో చెల్లింపులు జరిపే విధానాన్ని బలోపేతం చేయాలని అంగీకరించాయి. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఆర్థిక రంగం సహా పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు తొమ్మిది ఒప్పందాలకు రెండు దేశాలు సంతకాలు చేశాయి.

జైశంకర్ మాట్లాడుతూ రష్యాలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిలో 30,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని చెప్పారు. “వారిలో సుమారు 7,000 మంది కజాన్ కాన్సులేట్ పరిధిలో, 3,000 మంది యెకటెరిన్‌బర్గ్ కాన్సులేట్ పరిధిలో నివసిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, వ్యాపారులు అందరికీ ఈ రెండు ప్రాంతాల్లో భారత కాన్సులేట్ల సేవలు ఎంతో లాభదాయకంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు, జైశంకర్ మాస్కోలో మహాత్మా గాంధీకి పూల నివాళులు అర్పించారు. "ఆయన ఆదర్శాలు, బోధనలు మునుపెన్నడూ లేనంతగా నేడు మరింత సందర్భోచితంగా ఉన్నాయి" అని ఆయన అన్నారు.