రష్యాలో ఉద్యోగుల వెతలు
ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రధాన పరిశ్రమలు రైల్వేలు, ఆటోమొబైల్,సిమెంట్, బొగ్గు, లోహాలు, వజ్రాలు, కాగితం వంటి రంగాలు పని గంటలను తగ్గిస్తూ, కొంతమంది ఉద్యోగులను తాత్కాలికంగా సెలవులపై పంపిస్తున్నాయి.
రష్యా అతిపెద్ద సిమెంట్ తయారీదారు సెమ్రోస్ నాలుగు రోజుల వర్క్‌వీక్ విధానాన్ని ఈ సంవత్సరం చివరి వరకు కొనసాగించనుంది. 18 ప్లాంట్లలో 13,000 మంది పనిచేస్తున్న ఈ కంపెనీ లో ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టింది. చైనా, ఇరాన్, బెలారస్ నుంచి చౌకగా వస్తున్న సిమెంట్ దిగుమతులు, కొత్తగా ఇళ్ల నిర్మాణాలు మందగించడంతో డిమాండ్ తగ్గింది. రష్యన్ రైల్వేస్ 7 లక్షల ఉద్యోగులతో పనిచేస్తున్న సంస్థ, కోల్, మెటల్, ఆయిల్ రవాణా తగ్గడంతో, కేంద్ర కార్యాలయ సిబ్బందిని నెలకు మూడు రోజులు వేతనం లేకుండా సెలవు తీసుకోవాలని సూచించింది.
కమాజ్ , అవ్టోవాజ్ , జిఏజ్ వంటి వాహన తయారీ సంస్థలు కూడా పని దినాల్లో కొత పెట్టాయి. అల్రోసా వజ్ర సంస్థలో మైనింగేతర సిబ్బందిని 10% తగ్గించారు. స్వెజా అనే టింబర్ కంపెనీ ట్యూమెన్‌లోని ఫ్యాక్టరీని మూసివేయడంతో 300 మందికి పైగా ఉద్యోగాలు పోయాయి.
ఆర్థిక గణాంకాల ప్రకారం, రష్యా అ సంఘటిత రంగంలో ఈ సంవత్సరం జనవరి నుంచి వృద్ధి 5.4% తగ్గింది. మొత్తం జీడీపీ వృద్ధి 1%కి పరిమితం కానుందని అంచనా. నిరుద్యోగం తక్కువగా ఉన్నప్పటికీ (2.1%), చెల్లించని వేతనాలు 1.64 బిలియన్ రూబిళ్లకు చేరాయి. గత ఏడాదికంటే ఇది మూడింతలు ఎక్కువ. కూజ్‌బాస్ ప్రాంతంలో బొగ్గు రంగం అత్యంత ప్రభావితమైంది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో దాదాపు 19,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వం మాత్రం దివాళా మోరేటోరియం వంటి చర్యలతో రంగాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఇంతకుముందు 2008–09 ఆర్థిక సంక్షోభం, 2022 ఆటోమొబైల్ మందగమనం సమయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి బెయిల్ ఔట్‌లు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ బొగ్గు, లోహాలు, పాదరక్షలు, రవాణా రంగాలకు సహాయం అందిస్తోంది. మొత్తం మీద, యుద్ధం, ఆంక్షలు, చౌక దిగుమతులు రష్యా పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులను ఉంచుకునే ప్రయత్నం చేస్తూనే ఖర్చు తగ్గించే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
