Let's talk: editor@tmv.in
రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠిన ఆంక్షలు: డొనాల్డ్ ట్రంప్

రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠిన ఆంక్షలు: డొనాల్డ్ ట్రంప్

Shaik Mohammad Shaffee
18 నవంబర్, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై మాస్కో వైఖరి మారకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించారు. రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగించే ఏ దేశమైనా చాలా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కఠినమైన చట్టాలను రూపొందించడానికి తన పరిపాలన, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచే చర్యలను కాంగ్రెస్ ఆమోదించడానికి ఇది సమయమేనా? అని ఆదివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ, "వారు అలా చేస్తున్నారని నేను విన్నాను, అది నాకు అంగీకారమే" అని అన్నారు. 500 శాతం సుంకాల బిల్లుకు మద్దతు ట్రంప్ మాట్లాడుతూ, "రిపబ్లికన్లు చట్టాన్ని తీసుకువస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశానికైనా వ్యతిరేకంగా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. వారు దానికి ఇరాన్‌ను కూడా జోడించే అవకాశం ఉంది. నేను సూచించాను" అని పునరుద్ఘాటించారు.

సెనేటర్లు లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంతాల్ సంయుక్తంగా ప్రవేశపెట్టిన 'సాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025' ఈ కఠిన చర్యలకు మూలంగా ఉంది. ఈ బిల్లులో రష్యన్ చమురు, గ్యాస్ లేదా యురేనియం వంటి కీలక ఎగుమతులను కొనుగోలు చేసే దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 500 శాతం వరకు సుంకం విధించాలని ప్రతిపాదించారు.

ఉక్రెయిన్‌లో పుతిన్ సాగిస్తున్న "క్రూరమైన యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించే" దేశాలపై ద్వితీయ సుంకాలు, ఆంక్షలు విధించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో ఈ ప్రతిపాదనకు దాదాపు ఏకగ్రీవ మద్దతు లభించడం ఈ చట్టం అమలుకు బలం చేకూర్చింది.

భారత్, చైనాపై తీవ్ర ఒత్తిడి

రష్యా నుంచి చమురు, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ కఠినమైన 'ద్వితీయ ఆంక్షల' చట్టాన్ని రూపొందించారు. ట్రంప్ సర్కార్ రష్యా ఇంధన కొనుగోళ్లకు గాను భారత్‌పై ఇప్పటికే 25 శాతం సుంకం, అదనంగా 25 శాతం రిసిప్రోకల్ సుంకం (మొత్తం 50 శాతం) విధించింది. ఈ చర్యను రష్యా యుద్ధ యంత్రానికి పరోక్షంగా నిధులు సమకూర్చే దేశాలను లక్ష్యంగా చేసుకోవడం కోసం తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది.

"చౌక రష్యన్ చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేయడం ద్వారా పుతిన్ యుద్ధ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్న చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధించడం ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి అంతిమ అస్త్రం అవుతుంది" అని సెనెటర్ గ్రాహం గతంలో ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే భారత్ ఇప్పటికే రష్యా ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుందని, భవిష్యత్తులో ఈ కొనుగోళ్ల తగ్గింపు క్రమంగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఏదేమైనా 'సాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025' ఆమోదం పొందితే, ప్రపంచ వాణిజ్యంపై, ముఖ్యంగా రష్యా ఇంధనంపై ఆధారపడే దేశాలపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.