
రష్యాకు విమాన విడిభాగాల అక్రమ ఎగుమతి - భారతీయుడికి జైలు శిక్ష
అమెరికా రక్షణ చట్టాలను ఉల్లంఘించి, రష్యాకు కీలకమైన విమానయాన విడిభాగాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి ప్రయత్నించిన కేసులో ఒక భారతీయుడికి అక్కడి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన 58 ఏళ్ల సంజయ్ కౌశిక్‌కు 30 నెలల (రెండున్నర ఏళ్లు) జైలు శిక్ష విధిస్తూ ఒరెగాన్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
లాభం కోసం దేశ భద్రతతో చెలగాటం
అమెరికా అటార్నీ స్కాట్ బ్రాడ్‌ఫోర్డ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికాలోని ఒరెగాన్ నుండి రష్యాకు నిషేధిత విమాన విడిభాగాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నినందుకు 58 ఏళ్ల సంజయ్ కౌశిక్ అనే భారతీయ పౌరుడికి అమెరికా కోర్టు రెండున్నర ఏళ్ల (30 నెలలు) జైలు శిక్ష విధించింది. నిందితుడు ఢిల్లీకి చెందిన సంజయ్ కౌశిక్, అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విధంగా, రష్యాలోని నిషేధిత సంస్థలకు విమాన నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లను సరఫరా చేయడానికి ప్రయత్నించడం వల్ల అతనికి 30 నెలల జైలు శిక్షతో పాటు, విడుదలయ్యాక 36 నెలల పాటు పర్యవేక్షణలో ఉండాలి.
కౌశిక్ చర్యలు పూర్తిగా స్వార్థపూరితమైనవని, కేవలం లాభం కోసమే అతను అమెరికా జాతీయ భద్రతను పణంగా పెట్టాడని పేర్కొన్నారు. రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ, నిషేధిత సాంకేతికతను ఆ దేశానికి చేరవేయడానికి కౌశిక్ ఇతర నిందితులతో కలిసి భారీ కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందన్నారు.
అసలు ఏం జరిగింది?
కోర్టుకు సమర్పించిన ఆధారాల ప్రకారం, 2023 సెప్టెంబర్ నుండి ఈ అక్రమ రవాణా ప్రక్రియ మొదలైంది. ఒరెగాన్ రాష్ట్రంలోని ఒక సంస్థ నుండి 'ఆటిట్యూడ్ అండ్ హెడ్డింగ్ రిఫరెన్స్ సిస్టమ్' అనే పరికరాన్ని కౌశిక్ కొనుగోలు చేశారు. ఇది విమానాల నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్‌లో వాడే అత్యంత కీలకమైన పరికరం.
ఈ పరికరం తన సొంత భారతీయ కంపెనీ కోసమని, ఒక సాధారణ సివిల్ హెలికాప్టర్‌లో వాడతామని కౌశిక్ అధికారులను నమ్మించారు. అయితే నిజానికి అది రష్యాలోని సంస్థలకు పంపడానికి సిద్ధం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2024 అక్టోబర్‌లో మయామిలో కౌశిక్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది 2025 అక్టోబర్‌లో ఆయన తన నేరాన్ని అంగీకరించారు.
కఠిన శిక్షతో హెచ్చరిక
జైలు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత కూడా కౌశిక్ మరో 36 నెలల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. "సైనిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతికతను అక్రమంగా రవాణా చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ ఐసెన్‌బర్గ్ హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఉన్న ఎగుమతి ఆంక్షల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతోంది.
