
రష్యాకు చమురు దెబ్బ: ఆంక్షల ఉచ్చులో 'వార్ ఎకానమీ'.. పడిపోతున్న ఆదాయం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి క్రెమ్లిన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన చమురు, గ్యాస్ ఎగుమతులు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. యుద్ధం నాలుగో ఏట అడుగుపెడుతున్న తరుణంలో, పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా రష్యా ఇంధన ఆదాయం కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కొత్త ఆర్థిక సవాళ్లలోకి నెట్టివేస్తోంది.
తాజా గణాంకాల ప్రకారం, జనవరి 2026లో రష్యా చమురు, గ్యాస్ పన్ను ఆదాయం 393 బిలియన్ రూబిళ్లకు (5.1 బిలియన్ డాలర్లకు) పడిపోయింది. ఇది డిసెంబర్‌లో ఉన్న 587 బిలియన్ల కంటే గణనీయంగా తక్కువ. 2025 జనవరిలో ఇది 1.12 ట్రిలియన్ రూబిళ్లుగా ఉండేది. కేవలం ఏడాది కాలంలోనే ఆదాయం సగానికి పైగా పడిపోవడం రష్యా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ. కోవిడ్ పాండమిక్ తర్వాత ఆదాయం ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాపై ఆంక్షల తీవ్రత పెరిగింది. రష్యా ఇంధన దిగ్గజాలైన 'రోస్‌నెఫ్ట్', 'లుకోయిల్'లపై నవంబర్ 21 నుండి పూర్తిస్థాయి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ కంపెనీలతో లావాదేవీలు జరిపే ఏ అంతర్జాతీయ సంస్థ అయినా అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ నుండి బహిష్కరణకు గురయ్యేలా నిబంధనలను కఠినతరం చేశారు. ఇది రష్యా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది.
యూరోపియన్ యూనియన్ 'రిఫైన్డ్ ఫ్యూయల్' నిషేధం
జనవరి 21, 2026 నుండి యూరోపియన్ యూనియన్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ముడి చమురుతో ఇతర దేశాల్లో తయారైన పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను కూడా ఈయూ నిషేధించింది. గతంలో రష్యా చమురును భారత్ వంటి దేశాల్లో శుద్ధి చేసి యూరప్‌కు పంపే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ లూప్‌హోల్‌ను మూసివేయడంతో రష్యాకు ఉన్న ప్రధాన మార్కెట్ పూర్తిగా మూసుకుపోయింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. రష్యాకు షాక్
భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం రష్యాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. భారత ఎగుమతులపై టారిఫ్‌లను 25నుండి 18శాతానికి తగ్గిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా, ప్రతిగా భారత్ రష్యా నుండి చమురు దిగుమతులను తగ్గించేందుకు అంగీకరించిందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో రోజుకు 20 లక్షల బారెల్స్‌గా ఉన్న దిగుమతులు, జనవరి నాటికి 11.6 లక్షల బారెల్స్‌కు తగ్గాయి.
'షాడో ఫ్లీట్' పై నిఘా, భారీ డిస్కౌంట్లు
ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న 'షాడో ఫ్లీట్' (గుర్తుతెలియని పాత నౌకలు) పై అమెరికా, బ్రిటన్, ఈయూ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. సుమారు 640 నౌకలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. దీంతో రష్యా తన చమురును విక్రయించడానికి భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 62డాలర్లు ఉండగా, రష్యా చమురు కేవలం 38డాలర్ల నుండి 40 డాలర్ల మధ్యే అమ్ముడవుతోంది.
చమురు ఆదాయం తగ్గడంతో రష్యా తన బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతోంది. అమ్మకపు పన్నును 20శాతం నుండి 22శాతంకి పెంచడమే కాకుండా, విదేశీ కార్లు, మద్యం, సిగరెట్లపై సుంకాలను పెంచారు. 2026లో రష్యా జీడీపీ వృద్ధి రేటు కేవలం 1శాతంలోపు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
గాల్లో తేలుతున్న 12.5 కోట్ల బారెళ్ల చమురు
ఆంక్షల భయం వల్ల రష్యా చమురును కొనుగోలు చేయడానికి లేదా నౌకల నుండి దించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా సుమారు 12.5 కోట్ల బారెళ్ల చమురు సముద్రంలో ట్యాంకర్లలోనే నిలిచిపోయింది. ఇది రష్యాకు అదనపు నిల్వ ఖర్చులను పెంచడమే కాకుండా, అంతర్జాతీయంగా రవాణా నౌకల కొరతకు అద్దెలు పెరగడానికి దారితీస్తోంది.
యుద్ధ వ్యయం, భవిష్యత్తు సవాళ్లు
ఆదాయం తగ్గుతున్నప్పటికీ యుద్ధ వ్యయం ఏమాత్రం తగ్గకపోవడం క్రెమ్లిన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం రష్యా తన జాతీయ సంపద నిధి నుండి నిధులను వాడుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే, ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే, ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక యుద్ధ తీవ్రతను తగ్గించడమో లేదా చర్చలకు రావడమో రష్యాకు తప్పనిసరి కావచ్చు.
