Let's talk: editor@tmv.in
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు

రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 1,418 రోజులు దాటింది. యుద్ధం నాలుగేళ్లకు చేరుకున్నప్పటికీ, శాంతి ఒప్పందం ఇంకా అందనంత దూరంలోనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించడానికి సోవియట్ సైన్యానికి పట్టిన కాలంతో సమానంగా నిలిచింది. ప్రారంభ దశలో కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన రష్యా, అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతాలపై దృష్టి సారించింది. అయితే ఇప్పటికీ పూర్తి ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ యుద్ధం యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి అతిపెద్ద సైనిక ఘర్షణగా మారింది. అంచనాల ప్రకారం ఇరుపక్షాల నుంచి దాదాపు 20 లక్షల మంది సైనికులు చనిపోయిన, గాయపడిన, కనబడకుండా పోయారు. 2014లో క్రిమియాను అనధికారికంగా కలుపుకున్నప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ భూభాగంలో సుమారు 20 శాతం ఆక్రమించింది. అయితే 2022 తర్వాత పురోగతి చాలా మందగించింది.

భారీ సైనిక నష్టం

మొదట భారీ ట్యాంకులు, సైన్యంతో దాడులు సాగినప్పటికీ, ఇప్పుడు 1,200 కిలోమీటర్ల ఫ్రంట్‌లైన్‌లో ట్రెంచ్ వార్ ఫేర్ కొనసాగుతోంది. వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా ప్రకారం రష్యావైపు 12 లక్షల సైనిక నష్టం దాటగా, అందులో 3.25 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. ఉక్రెయిన్ సుమారు 6 లక్షల సైనిక నష్టం జరగ్గా, అందులో 1.4 లక్షల వరకు మృతులు ఉన్నట్లు అంచనా. డోనెట్స్‌క్ ప్రాంతంలో గత రెండేళ్లలో రష్యా దళాలు కేవలం 50 కిలోమీటర్ల మేర మాత్రమే ముందుకు సాగాయి. ఈ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ మొదట డ్రోన్లతో రష్యా దళాల పురోగతిని అడ్డుకోగా, ఇప్పుడు రష్యా కూడా అధునాతన ఆప్టికల్ ఫైబర్ డ్రోన్లను వినియోగిస్తోంది.

ఈ శీతాకాలం అత్యంత క్లిష్టమైందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థలపై రష్యా భారీ దాడులు జరిపి కీవ్‌లో విద్యుత్ సరఫరా గంటలకే పరిమితం అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. దీనికి దీటుగా ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, శక్తి మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు చేసింది. బ్లాక్ సీలో రష్యా యుద్ధ నౌకలను ముంచడంతో రష్యా తన నౌకాదళాన్ని క్రిమియా నుంచి నోవొరోసిస్క్‌కు తరలించింది.

తెగని శాంతి ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ యుద్ధం త్వరగా ముగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే చర్చలు భిన్నమైన డిమాండ్లతో ఆగిపోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ డోనెట్స్‌క్ సహా నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, నాటో సభ్యత్వ యత్నాలను విరమించాలని, రష్యన్ భాషకు అధికార హోదా కల్పించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ ఇవన్నీ తిరస్కరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రస్తుతం ఉన్న సరిహద్దుల వద్ద కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే పుతిన్ పూర్తి శాంతి ఒప్పందం లేకుండా తాత్కాలిక విరమణను అంగీకరించడంలేదు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇరువురు నేతలు ప్రశంసిస్తున్నప్పటికీ, పరస్పర అనుమానాలు కొనసాగుతున్నాయి. వైట్ హౌస్ జూన్ నాటికి యుద్ధం ముగించాలని గడువు విధించినట్లు జెలెన్స్కీ తెలిపారు. అయినప్పటికీ డోనెట్స్‌క్ నుంచి సైన్యం ఉపసంహరణపై విభేదాలు కొనసాగుతున్నందున త్వరితగతిన ఒప్పందం సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక పరంగా పాశ్చాత్య ఆంక్షల ప్రభావం రష్యాపై పెరుగుతున్నప్పటికీ, రక్షణ ఉత్పత్తి సామర్థ్యం కొనసాగుతోంది. అంతర్గత అసంతృప్తి రాజకీయ ఒత్తిడిగా మారే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్ల యుద్ధం అనంతరం కూడా రష్యా–ఉక్రెయిన్ ఘర్షణకు ముగింపు కనిపించకపోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.