Let's talk: editor@tmv.in
ర‌ష్యా విమానాల‌ను కూల్చేయండి

ర‌ష్యా విమానాల‌ను కూల్చేయండి

Venkatesh Balusula
25 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ర‌ష్యాకు వ్య‌తిరేకంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌గ‌న‌త‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న ర‌ష్యా విమానాల‌ను కూల్చివేయాల‌ని పిలుపునిచ్చారు. ఐక్య రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నాటో దేశాల గగనతంలో తరచూ రష్యా యుద్ధ విమానాలు, డ్రోన్లు ప్రవేశించడంపై చర్చ జరిగింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని జెలెన్ స్కీ ట్రంప్‌ను ప్రశ్నించగా కూల్చివేయాల‌ని స‌మాధాన‌మిచ్చారు.

ఆస‌క్తి రేకెత్తిస్తున్న ట్రంప్ వ్యాఖ్య‌లు

ఇటీవ‌లి కాలంలో నాటో దేశాల గ‌గ‌న‌త‌లంలో ర‌ష్యా యుద్ధ విమానాలు, డ్రోన్ల చ‌క్క‌ర్లు తీవ్ర‌మైన సంగ‌తి తెలిసిందే. పోలండ్‌, ఎస్తోనియా వంటి దేశాల్లో ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో యూరోపియ‌న్ దేశాల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. పోలండ్‌లో మూడు డ్రోన్ల‌ను ధ్వంసం చేశారు. ర‌ష్యా మాత్రం ఎలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై నాటో దేశాల్లో తీవ్ చ‌ర్చ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఎంత న‌మ్మ‌కం ఉందంటూ ట్రంప్‌ను జెలెన్ స్కీ ప్ర‌శ్నించ‌గా ఒక నెలలో స‌మాధానం చెప్తాన‌న్నారు. ట్రంప్ వ్యాఖ్య‌ల వెనుక ఉద్దేశం ఏమిట‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేప‌థ్యంలో ట్రంప్ త‌దుప‌రి ఏ నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ భేటీపై జెలెన్ స్కీ సానుకూలంగా స్పందించారు.

ర‌ష్యా దాడుల‌పై అస్ప‌ష్ట‌త‌

రష్యా ఉక్రెయిన్‌పై దాడులు పెంచిన నేప‌థ్యంలో యూరప్ తూర్పు సరిహద్దుకు యుద్ధం వ్యాప్తి చెందుతుంద‌న్న ఆందోళనలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా రంగంలోకి దిగి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, యూర‌ప్ దేశాలు కూడా త‌మ వంతుగా చ‌ర్య‌లు తీసుకుంటాయ‌ని జెలెన్‌స్కీ కోరారు. ట్రంప్ నాటో మిత్రదేశాలు రష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు ఆపాలని షరతులు పెట్టారు. జెలెన్ స్కీ యుద్ధ ముగింపు చ‌ర్చ‌ల్లో భాగంగా ఉక్రెయిన్‌కు శాశ్వ‌త ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. పుతిన్ దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. ప‌శ్చిమ దేశాల కూట‌మిలో ఉక్రెయిన్ చేరిక‌ను అంగీక‌రించ‌డం లేదు. అల‌స్కాలో ట్రంప్, పుతిన్ చ‌ర్చ‌ల అనంత‌రం ర‌ష్యా దాడుల తీవ్రత మ‌రింత పెంచింది. ర‌ష్యా సైన్యం ఇటీవ‌లి కాలంలో 40 మిసైళ్లు, 580 డ్రోన్లతో దాడికి పాల్ప‌డింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ప‌దుల సంఖ్య‌లో గాయాల‌పాల‌య్యారు. ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో నాటో మిత్రదేశాలు యూరప్ తూర్పు సరిహద్దుల్లో ర‌క్ష‌ణ‌ను మ‌రింత బ‌లోపేతం చేశాయి. నాటో దేశాల‌పై ర‌ష్యా వాయుమార్గంలో దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఇటీవ‌లి కాలంలో పోలండ్ స‌రిహ‌ద్దుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఎస్త‌నీస్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లే చోటుచేసుకున్నాయి. కానీ, ఇవి ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగాయా లేదా పొర‌పాటున జ‌రిగాయా అన్నదానిపై స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.

ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా విఫ‌ల‌మ‌వుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్నారు. యుద్దం ఆపేందుకు ర‌ష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా ఎలాంటి ఫ‌లితం ఇవ్వ‌డం లేదు. నాటోలో ఉక్రెయిన్ చేరిక‌కు పుతిన్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. చ‌ర్చ‌ల్లో ర‌ష్యా ప్ర‌యోజ‌నాల గురించి, భ‌ద్ర‌త గురించి ఏమాత్రం ప్ర‌స్తావించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. రష్యా విమానాలు కూల్చేయండి అంటూ ట్రంప్ పిలుపునివ్వడం రెండు దేశాల మధ్య యుద్ధం ఆపాలనే ఉద్దేశంతో చెప్పినట్లు లేదు. దీని వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. రష్యా డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకొని యుద్ధం ఆపేందుకు చర్యలు తీసుకోవాలి కానీ, బెదిరింపులకు పాల్పడితే రష్యా తలొగ్గుతుందని భావించడం సరికాదు. రష్యా ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం కూడా ఉంది. ట్రంప్ మొదటి నుంచి రష్యాను భయపెట్టాలనే చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదు.

ట్రంప్ తాజా వ్యాఖ్యలు నాటోకు స్ప‌ష్ట‌మైన మద్దతునిస్తున్నాయి. రష్యా గ‌గ‌న‌త‌ల‌ ఉల్లంఘనలపై ట్రంప్ మొద‌టిసారి స్పందించారు. ట్రంప్ వ్యాఖ్య‌లు నాటో దేశాల‌కు మ‌రింత బ‌లాన్నిస్తాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా నాటో దేశాల‌కు సైనిక మ‌ద్ద‌తు పెంచుతుంద‌న్న‌ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. నాటో, రష్యా మధ్య ఘ‌ర్ష‌ణ‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా ర‌ష్యాపై మ‌రిన్ని క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తే ఆర్థికంగా దెబ్బతినే అవ‌కాశం. కానీ, యూరోపియ‌న్ దేశాల‌పై ఇది తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. ఫ‌లితంగా అంత‌ర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా మార‌తాయి. ట్రంప్ ఒప్పందాలు, ఒత్తిళ్ల‌కు ర‌ష్యా త‌లొగ్గుతుందా లేదా దాడులు మరింత తీవ్రం చేస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ర‌ష్యా విమానాల‌ను కూల్చేయండి - Tholi Paluku