
రష్యా ఆక్రమణలకు అడ్డుకట్ట
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. ఈశాన్య ఉక్రెయిన్లోని ప్రధాన నగరం సుమీ ప్రాంతంలో ఉత్తర సరిహద్దు జిల్లాల్లో తమ బలగాలు ముందడుగు వేస్తున్నాయని తెలిపారు. రష్యా సైన్యం ఈ ప్రాంతంలో నెలల తరబడి పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా జెలెన్ స్కీ వీడియో సందేశంలో ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం డొనెట్స్క్, ఖార్కివ్ ప్రాంతాల్లో రష్యా సైన్యాన్ని ఎదుర్కొందని, ఈ ఘటనలో రష్యాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ విషయాన్ని ఆ దేశ అత్యున్నత సైనికాధికారి తెలిపినట్లు వెల్లడించారు.
రష్యా సైన్యానికి భారీ నష్టాలు
రష్యా గత వారం డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలో తమ సైన్యం పురోగతి సాధిస్తోందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా సైన్యం తూర్పు ఉక్రెయిన్లో నెమ్మదిగా ముందుకు సాగుతూ వస్తోంది. ప్రతి రోజు స్థానిక గ్రామాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటిస్తుంది. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. వీటిలో డినిప్రోపెట్రోవ్స్క్లో కొన్ని గ్రామాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో సుమీ ప్రాంత సరిహద్దుల్లో ఉక్రెయిన్ సైన్యం కూడా మంచి ఫలితాలు సాధిస్తోందని, దేశ సరిహద్దు వైపు ముందుకు సాగుతోందని జెలెన్స్కీ చెప్పారు.
రష్యా ఈ ఏడాది ఉక్రెయిన్ సైన్యాన్ని కుర్స్క్ ప్రాంతం నుంచి తరిమివేసింది. తర్వాత సుమీలో ఒక బఫర్ జోన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం ఈ ప్రాంతంలోని పెద్ద పట్టణాలు, సుమీ నగరంపై తరచూ బాంబు దాడులు చేస్తోంది. ఖార్కివ్ ప్రాంతంలోని కుపియాన్స్క్ సమీపంలో రష్యా సైన్యం భారీ నష్టాలను చవిచూసిందని జెలెన్స్కీ తెలిపారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో రష్యా దాడులను తమ సైనికులు తిప్పికొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రష్యా నియంత్రణలోని డొనెట్స్క్ ప్రాంత అధికారి డెనిస్ పుషిలిన్ తమ సైన్యం పోక్రోవ్స్క్ సమీపంలోని గ్రామాలను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఖెర్సన్ ప్రాంతంలో రష్యా బాంబు దాడులు, డ్రోన్ దాడుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుదిన్ తెలిపారు.
శాంతి చర్చలపై రాని స్పష్టత
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సుమీ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం సాధిస్తున్న పురోగతి ఆ దేశానికి కీలకంగా మారనుంది. నెలల తరబడి తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్లో ఈ ఘటన సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ క్రమంలో సైన్యం సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రష్యా తూర్పు ఉక్రెయిన్తో పాటు డొనెట్స్క్, ఖార్కివ్ ప్రాంతాల్లో పురోగతి సాధిస్తోంది. రోజురోజుకు రష్యా నియంత్రణను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉక్రెయిన్లో రాజకీయ, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు సుమీలో జరుగుతున్న రష్యా బాంబు దాడుల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో జెలెన్ స్కీ ప్రకటన సైనికులతో పాటు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం రోజురోజుకూ ముదురుతున్నా శాంతి చర్చలపై ఎలాంటి స్పష్టత రాలేదు. అలస్కాలో ట్రంప్తో పుతిన్ భేటీ అయినా ఈ చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వలేకపోయాయి. ఈ చర్చల అనంతరం ట్రంప్ కొన్ని వారాల్లో యుద్ధానికి ముగింపు పలుకుతామని చెప్పారు. ప్రస్తుతం రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న దేశాలపై సుంకాల భారం మోపేందుకు ట్రంప్ నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్. జీ7 దేశాలు కూడా ఆయా దేశౄలపై వంద శాతం సుంకాలు విధించాలని సూచిస్తున్నారు. యుద్ధం ముగించాలంటే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే ప్రధాన మార్గమని ట్రంప్ భావిస్తున్నారు. యుద్ధం ముగిసిన అనంతరం పెంచిన సుంకాలు తగ్గించవచ్చని ట్రంప్ తెలిపారు.
