
రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో భావోద్వేగ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సంగీత రంగానికి చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని ప్రశంసించారు. భాషలకతీతంగా కోట్లాది మంది హృదయాల్లో తన గానంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో ఆయన పాడిన పాటలు తరతరాలుగా శ్రోతలను అలరిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.బాల సుబ్రహ్మణ్యం కేవలం స్వర సార్వభౌముడు మాత్రమే కాదు, ఆయన సంస్కారవంతుడు, నిరాడంబరుడు. ఆయన గాత్రంలో నవరసాలు నాట్యం చేసేవి. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, మార్గదర్శిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎస్పీబీ యువతకు ఆదర్శమని వెంకయ్యనాయుడు అన్నారు. సంగీతాన్ని సాధనగా కాకుండా సాధనతో కూడిన సాధ్యంగా మార్చుకున్న వ్యక్తిగా ఆయనను కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణతో రవీంద్రభారతి ప్రాంగణం మరింత కళాత్మక వైభవాన్ని సంతరించుకుందని నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత వారసత్వాన్ని గుర్తు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
