
రవీంద్రభారతిలో ‘శ్రీ పరాభవ నామ’ ఉగాది వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించే ఈ అధికారిక వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వేద పండితులతో కలిసి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ వేడుకల్లో భాగంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉగాది పచ్చడి పంపిణీ వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో మంత్రిమండలి సభ్యులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆనందోత్సాహం నెలకొంది. ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు, సంగీత నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
