
రవీంద్రభారతిలో కవి అందెశ్రీ సంతాప సభ
తెలంగాణ సకల జన సహజ కవిగా పేరుగాంచిన అందెశ్రీ సంస్మరణ సభ శనివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న ముఖ్య అతిథి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు.
కవి అందెశ్రీ తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా కొనియాడారు. వజ్రాల గురించి ఎంత చర్చించినా కోహినూర్ వజ్రానికి పోటీ లేనట్టే, రేపటి తెలంగాణ చరిత్రలో అందెశ్రీ మొదటి స్థానంలో నిలబడతారు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జీవితంలో బడి ముఖమే చూడని అందెశ్రీ రాసిన "జయ జయహే తెలంగాణ" గీతం యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.బడికి వెళ్లని అందెశ్రీ అన్న 'జయ జయహే తెలంగాణ..' అంటూ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితేనే రాష్ట్ర కల నిజమైంది" అని సీఎం ఉద్వేగంగా మాట్లాడారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలే కాక, ప్రపంచంలోని ప్రతి మూలకు ఈ గీతాన్ని చేర్చి ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప తెలంగాణ బిడ్డ అందెశ్రీ అని కొనియాడారు.గత పాలకుల హయాంలో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ గీతానికి అధికారిక హోదా లభిస్తుందని 4 కోట్ల ప్రజలు ఆశించినా అది నెరవేరలేదని సీఎం గుర్తు చేశారు.జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాక, చదువు చెప్పే ప్రతి పాఠ్యపుస్తకంలో మొదటి అంశంగా చేర్చాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.పెన్నే కదా అని మన్నుకప్పితే గన్నులై మొలకెత్తుతాయి.. గన్నులై గడీలే కుప్పుకూలుతయన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారని సీఎం ప్రశంసించారు.
మలిదశ ఉద్యమానికి పునాదులు వేసిన గద్దర్, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న వంటి వారి త్యాగాన్ని మరువలేమని ముఖ్యమంత్రి అన్నారు.సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా 5 దశాబ్దాలు పనిచేసిన అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించారు.అందెశ్రీ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్మృతివనం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆయన రాసిన "నిప్పుల వాగు" పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అందెశ్రీ పేరిట జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు, సభలో వక్తలు చేసిన సూచనలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 9 మంది ఉద్యమ కవులు, కళాకారులకు 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి, వారికి భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అందెశ్రీ సతీమణి మల్లుబాయితో పాటు కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ఈ సంస్మరణ సభలో పాల్గొని అందెశ్రీకి నివాళులర్పించారు.
ఈ సందర్భ ప్రసంగంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ
రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు.
ఈ సందర్భ ప్రసంగంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, “సహజ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. తన మాట, పాటల ద్వారా మనుషుల జీవితాలను కండ్లకు కట్టిన గొప్ప కవి ఆయన. మనుషుల, మానవత్వంపై అద్భుతమైన గీతాలను రాసి తెలంగాణ జాతిని జాగృతం చేసిన విప్లవకారుడు అందెశ్రీ.అని మంత్రి తెలిపారు. మంత్రి, ఆయన కవితలలో మనిషి, ప్రకృతి, సేవ, మానవత్వానికి సంబంధించిన భావాలు స్పష్టంగా వ్యక్తమై ఉంటాయి. “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” వంటి పాటలు వింటే సమాజంలోని నిజాలు, మనుషుల పరిస్థితులు అర్థమవుతాయని. జీవితంలో ఎదురైన గాయాలను గేయాలుగా మార్చి ప్రతి గుండెను తట్టి లేపిన వ్యక్తి ఆయననే అందెశ్రీ అన్నారు.
సహజ కవిగా, సాహిత్యానికి బడికట్టే కాని, మానవత్వానికి, ప్రజలకి చెందిన కవిగా ఆయనను గుర్తించిన మంత్రి, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మనం అందించే ఘన నివాళి, కుల, మతాలకు అతీతంగా మానవత్వపు విలువలతో బతకడం, సహజ కవి అందెశ్రీ స్ఫూర్తిని కొనసాగించడం అని మంత్రి చెప్పారు.పేదరికంలో పుట్టి, కష్టాలను ఓర్చి, మానవత్వం, ప్రకృతిని జీవన మార్గంగా చేసుకున్న ఆయన, భౌతికంగా మన మధ్య లేకపోయినా రచనలు, పాటలు, జాతి గీతం రూపంలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని మంత్రి తెలిపారు.
