Let's talk: editor@tmv.in
రవాణా శాఖ చెక్‌పోస్టులు శాశ్వతంగా రద్దు: మంత్రి పొన్నం

రవాణా శాఖ చెక్‌పోస్టులు శాశ్వతంగా రద్దు: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
23 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే రద్దు చేస్తూ జీవో జారీ చేసి, బుధ‌వారం నుంచి అమలులోకి తెచ్చినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రకటించారు. చెక్‌పోస్టుల రద్దు నిర్ణయాన్ని రెండు నెలల క్రితమే తీసుకున్నప్పటికీ, పారదర్శకత కోసం ఆన్‌లైన్ ప్రక్రియను పటిష్టం చేసి, బుధ‌వారం నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు.

పారదర్శకత, అవినీతి నిర్మూలనే ధ్యేయం

గత పది సంవత్సరాల్లో రవాణా శాఖలో అవినీతి 'పాపాల పుట్ట'లా పేరుకుపోయిందని" మంత్రి విమర్శించారు. శాఖలో పారదర్శకతను పెంచడానికి, బ్రోకర్ల వ్యవస్థను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. చెక్‌పోస్టుల రద్దు నిర్ణయాన్ని తానే స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్‌లో ఆమోదింపజేశానని మంత్రి వెల్లడించారు. వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో ముందడుగు

కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ. 577 కోట్ల టాక్స్‌ను మినహాయించిందని మంత్రి వివరించారు. ఈవీల అమ్మకాలు గతంలో 0.03 శాతం ఉండగా, ప్రస్తుతం 1.13 శాతం షేర్‌కు పెరిగిందని తెలిపారు. ఢిల్లీలో ఉన్న కాలుష్య పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండడానికే ఈ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇవ్వగా, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోలకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. అదనంగా 25 వేల రెట్రోఫిటింగ్ ఆటోలకు కూడా అనుమతి ఇచ్చామన్నారు.

సాంకేతికతతో రవాణా సంస్కరణలు

వాహన్ సారథి రాష్ట్రంలో ఇప్పటికే 'వాహన్' అమలు జరుగుతోందని త్వరలోనే 'సారథి' వ్యవస్థను కూడా తీసుకొస్తామని మంత్రి తెలిపారు. వాహన్ సారథి లో 28 రాష్ట్రాలు ఉన్నాయి గత పదేళ్లుగా తెలంగాణ ఈ వ్యవస్థల్లో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డేటా ట్రాన్స్‌ఫార్మింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఏఐ టెక్నాలజీ రవాణా శాఖ కార్యాలయాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి, అనవసరంగా లేదా రెగ్యులర్‌గా వచ్చే వ్యక్తులను గుర్తించి, హెడ్ ఆఫీస్‌కు అలర్ట్‌ చేసేలా నిరోధక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పర్యవేక్షణ: బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి, రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. టూరిజం వెహికల్స్‌కు డబుల్ నంబర్ ప్లేట్‌ల ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లు అమలుపై దృష్టి సారించినట్టు తెలిపారు.

రోడ్ సేఫ్టీ - ఎన్‌ఫోర్స్‌మెంట్

రోడ్ సేఫ్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్కులను నాచారంలో గవర్నర్ ప్రారంభించగా, కరీంనగర్‌లో కూడా ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

స్క్రాపింగ్ పాలసీ: పాత వాహనాల స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చామని, పోలీస్, ఆర్టీసీ వంటి ప్రభుత్వ విభాగాల పాత వాహనాలను కూడా స్క్రాప్‌కు పంపాలని లేఖ రాశామని తెలిపారు.

కఠిన చర్యలు: ఇల్లీగల్ ఓవర్ లోడింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

TS ను TG గా మార్చాం..

రవాణా శాఖకు రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్‌మెంట్‌గా ఉన్నందున 112 మంది ఏఎంవీఐలను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే నలుగురు ఆర్టీఓలు గ్రూప్-1 ద్వారా వచ్చారని తెలిపారు. అలాగే తెలంగాణ పోలీస్, ఫారెస్ట్ మాదిరిగానే రవాణా శాఖకు కూడా ఒక లోగో తీసుకొచ్చామ‌ని తెలిపారు. TS స్థానంలో TGను అమలు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.7 కోట్ల వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా మంత్రి చర్యలు తీసుకుంటున్నామన్నారు.