
రీల్స్ పిచ్చితో యువతి దుస్సాహసం
‘పిచ్చి ముదిరింది రోకలి చుట్టండి అన్నాడట’ వెనకటికి ఎవరో... అలానే తయారైంది ప్రస్తుత తరం. సోషల్ మీడియా రాకతో యువతలో రీల్స్, షార్ట్స్ పిచ్చి ముదిరింది. దీంతో నదులు, సముద్రాలు, కొండలు, లోయలు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ లు ఇలా ఒక్కటేమిటి రీల్స్ తీసుకోవడానికి ఏ ప్రాంతం అనర్హమైనది కాదంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకులు, కామెంట్ల కోసం భిన్నంగా రీల్స్ చేయాలనే ఆరాటంలో జీవితాలను కోల్పోతున్నారు. ఎంతో విలువైన ప్రాణాలను కేవలం ముప్పై సెకన్ల దృశ్యాల కోసం అర్పించేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మైసూరులో జరిగింది.
మైసూర్ లోని దసరా ఏనుగులతో
కర్ణాటకలోని మైసూరులో దసరా పండగ చాలా ప్రత్యేకం. అందులో జంబూ సవారీ అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం. ఈ ఉత్సవాలకు ఏనుగులను తీసుకొచ్చారు. అయితే ఆ ఏనుగులతో ఓ యువతి అత్యంత ప్రమాదకరంగా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.
ఏనుగులను చూసే మావటీలు తప్ప ఇతరులు ఏనుగుల దగ్గరికి వెళ్లాలంటనే హడలెత్తిపోతారు. అలాంటిది ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ఓ యువతి రాత్రి సమయంలో వాటి దగ్గరికి వెళ్లి పిచ్చిగా డ్యాన్స్ చేసి రీల్స్ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అవి చాలా వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటకలో పెద్ద దుమారం రేగింది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆమెను అడ్డుకోకపోవడంతో వారిపై అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో నుంచి తొలగించారు. కేసు నమోదు చేసుకొని ఆ యువతి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
