Let's talk: editor@tmv.in
రైల్వే రిజర్వేషన్కు ఆధార్ లింక్

రైల్వే రిజర్వేషన్కు ఆధార్ లింక్

Gaddamidi Naveen
17 సెప్టెంబర్, 2025

భారతీయ రైల్వే సేవలలో పారదర్శకతను పెంపొందించేందుకు, టికెట్ రిజర్వేషన్లను నిర్వహించేందుకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని వేగవంతం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. త్వరలో రైలు టికెట్ బుకింగ్ ఆన్లైన్ లేదా కౌంటర్ ద్వారా కోసం ఆధార్ వివరాలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్కు కూడా ఆధార్ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది.

ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ కోటా టికెట్లకు కూడా వర్తింపచేస్తున్నారు. ఒక ప్రయాణికుడు నవంబర్ 15న ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే, నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగా, అంటే సెప్టెంబర్ 16న అర్ధరాత్రి 12. 20 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కొత్త నిబంధన ప్రకారం, 12. 20 నుంచి 12. 35 గంటల మధ్య, అంటే మొదటి 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ఐఆర్సిటిసి యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు. ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఆ సమయంలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు. నిజమైన ప్రయాణికులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పండగల సమయంలో

దీపావళి, హోళి, చార్ ధామ్ వంటి ప్రధాన పండగల సమయంలో, పెళ్లిళ్ల సీజన్లో రైలు టికెట్లకు పోటీ తీవ్రంగా ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోతాయి. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు, ఏజెంట్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఆధార్ ఆధారిత నిబంధనతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది.

దీనివల్ల సాధారణ, నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటికే గత జూలై నుంచి తత్కాల్ బుకింగ్కు ఈ విధానం అమలవుతోంది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, అక్టోబర్ 1లోగా తమ ఐఆర్సిటిసి యూజర్ ఐడీకి ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. ప్రజలకు నాయ్యమైన టికెట్లు అందించడమై తమ లక్ష్యం అని రైల్వే శాఖ అధికారులు తెలిపారు

రైల్వే రిజర్వేషన్కు ఆధార్ లింక్ - Tholi Paluku