
రబీ సీజన్‌కి రైతులకు ఉచిత మినీ కిట్లు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరో కీలక చర్య తీసుకుంది. రబీ 2025- 26 సంవత్సరానికి గాను సీజన్‌లో రైతులకు 92,518 ఉచిత మినీ కిట్లను అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించి, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ సీజన్‌లో 8,385 కిసాన్ పాఠశాలలు, బ్లాక్ స్థాయిలో ప్రదర్శనలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందించి పప్పు సాగు వైపు ఆకర్షించడానికి, అవగాహన పెంపొందించడానికి ఉద్దేశించినవి. రబీ పంటలు ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఎక్కువ దిగుబడినిచ్చి, తక్కువ వ్యాధులకు గురవుతాయి. ఈ నేపథ్యంలో, పప్పుధాన్యాల సాగును విస్తరించేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది.
ఈ పథకంలో భాగంగా, ఉచిత మినీ కిట్లతో పాటు, ఎకరా ప్రదర్శనలు, కిసాన్ పాఠశాలలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంబించేలా ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.4,000 గ్రాంట్ అందిస్తున్నారు. జాతీయ ఆహార భద్రత , పోషణ మిషన్ కింద 10 సంవత్సరాల లోపు విత్తనాలకు క్వింటాల్‌కు రూ.5,000, అంతకంటే పాత విత్తనాలకు రూ.2,500 సబ్సిడీ ఇస్తారు. అదనంగా, క్లస్టర్ డెమోలకు హెక్టారుకు రూ.9,000, పంట పద్ధతి ప్రదర్శనలకు రూ.15,000 కేటాయించారు. ఈ గ్రాంట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయి.
ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహీ మాట్లాడుతూ ‘రైతులు దేశ ఆర్థిక శక్తి. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. రబీ సీజన్‌లో ఉత్పత్తి పెంచేందుకు రైతులను ఉత్తేజపరిచేందుకు కిసాన్ పాఠశాలలు, సెమినార్లు నిర్వహిస్తున్నాం. విత్తనాలకు బయో రసాయనాలు, కీటకనాశకాలతో చికిత్స చేయడం, రైజోబియం కల్చర్ వినియోగం ద్వారా నేలలో 20 నుండి 25 కిలోల నైట్రోజన్ నిల్వ జరుగుతుంది, ఇది ఖర్చును తగ్గించి దిగుబడిని పెంచుతుంది’ అన్నారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని, పప్పు ఉత్పత్తిని గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
