
రబీలో యూరియా సమస్య తలెత్తకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు
రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో వ్యవసాయ శాఖ, అనుబంద శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే బఫర్ స్టాక్స్ ని ఉపయోగించుకోవాలని, అన్ని ఆర్ ఎస్ కే లలో అన్ని రకాల ఎరువులు అవసరమున్న రైతులకు అందుబాటులోకి ఉంచాలని అన్నారు.
రబీ సీజన్‌కు మొత్తం 20.69 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉండగా, ఇప్పటివరకు 2.38 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీ నాటికి 9.38 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, అందుబాటులో 4.01 లక్షల టన్నులు నిల్వగా ఉన్నాయని, అదే సమయంలో 2.10 లక్షల టన్నుల యూరియా రైతులకు అందజేశామని, ఇంకా 1.91 లక్షల టన్నుల యూరియా నిల్వగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు.
ముఖ్యంగా అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో అవసరానికి అనుగుణంగా సరఫరా నిల్వలు ఉంటున్నాయని, అదనంగా 9,432 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా దశలో ఉంది. జిల్లాల వారీగా ఎంత అవసరం, ఎంత అందుబాటులో ఉంది, పంపిణీ వివరాలు కూడా సమగ్రంగా నమోదు చేయబడ్డాయన్నారు.
కృష్ణా, గంగవరం, కాకినాడ, గోదావరి జిల్లాల్లోని పోర్టుల్లో 1.35 లక్షల టన్నుల యూరియా స్టాక్‌గా ఉంది. అవసరాన్ని బట్టి ఈ స్టాక్‌ను జిల్లాలకు తరలిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఎరువుల సమీకరణ, పంపిణీ జరుగుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని రవాణాలు చేరనున్నాయని. ఎరువుల కొరత ఏ జిల్లాలోనూ తలెత్తకుండా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.
గ్రోమోరు షాప్స్ వద్ద తరచుగా యూరియా సరఫరా సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అన్వేషించి పరిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా నిల్వల లెక్కలు పక్కాగా ఉండాలని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను వ్యత్యాసాలు లేకుండా అందచేయాలని అన్నారు. జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపి రైతులకు యూరియా సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణా, దందాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ఎరువుల సరఫరాలో ఏ చిన్న అంతరాయం వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని అన్నారు.
ఆగ్రోస్ సంస్థలో వస్తున్న వరుస అవినీతి కథనాలపై దర్యాప్తు
ట్రేడర్స్ సకాలంలో విత్తనాలను రైతులకు అందచేయటం లేదని, అలాంటి వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. ఇటీవల ఆగ్రోస్ సంస్థలో వస్తున్న వరుస అవినీతి కథనాలపై స్పందించిన మంత్రి వెంటనే కార్యకలాపాలపై విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆదేశించారు. ఆగ్రోస్ ద్వారా రైతులకు సబ్సీడిపై అందచేసే వాహనాలలో మార్పు లేకుండా సరఫరా చేయాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ పరికరాలను సద్వినియోగం చేసుకునే విధంగా రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. తుఫాన్లను తట్టుకునే విధంగా, మంచి దిగుబడిని అందచేసే వరి వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కూరగాయాల ధరలు పెరగకుండా దృష్టి సారించాలని, వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పొగాకు రైతులకు డబ్బులు వచ్చాయని రైతులు ఆనందంగా తనకు ఫోన్ చేసి చేప్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
