Let's talk: editor@tmv.in
రఫేల్ యుద్ధవిమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం

రఫేల్ యుద్ధవిమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం

Pinjari Chand
30 అక్టోబర్, 2025

రాష్ట్రపతి ముర్ము రఫేల్ ప్రయాణం(సార్టీ)తో భారత్ వైమానిక దళ చరిత్రలో మరో మైలురాయిని సృష్టించారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రఫేల్ యుద్ధవిమానంలో చారిత్రాత్మక ప్రయాణం (సార్టీ) చేశారు. ఈ సందర్భంగా ఆమె సైనిక దుస్తులు ధరించి వచ్చారు. ఎంతో ఉత్సాహంగా ఆమె ఇందులో ప్రయాణించారు. రాష్ట్రపతి వెంట ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతికి రఫేల్ యాత్రకు ముందు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఇలా యుద్ధ విమానం లో ముర్ము ప్రయాణించడం రెండోసారి. అంతకుముందు 2023 ఏప్రిల్ 8న ఆమె అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. భారత వైమానిక చరిత్రలో యుద్ధవిమానంలో పయాణించిన తొలి మహిళా సుప్రీం కమాండర్‌గా నిలిచారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హర్యానాలోని అంబాలాను సందర్శించి రఫేల్ యుద్ధవిమానంలో ప్రయాణించనున్నారు అని పేర్కొంది. అంతకుముందు, మంగళవారం నాడు రాష్ట్రపతి న్యూ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) అసెంబ్లీ ఎనిమిదవ సెషన్ ప్రారంభ సదస్సును ప్రారంభించారు.

రాష్ట్రపతితో కలిసి గగనంలో ప్రయాణించిన వైమానిక దళాధిపతి ఏ.పీ. సింగ్

భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బుధవారం ఆకాశంలో రఫేల్ యుద్ధవిమానాన్ని నడిపి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన చారిత్రాత్మక సార్టీకి ఫార్మేషన్ లీడర్‌గా వ్యవహరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ వేరొక రఫేల్ జెట్‌ను నడిపారు. రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన రఫేల్‌తో సమాంతరంగా, సమన్వయంతో ప్రయాణించారు. ఇది భారత వైమానిక దళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక క్షణంగా నిలిచింది. రాష్ట్రపతి ప్రయాణించిన విమానాన్ని గ్రూప్ క్యాప్టెన్ అమిత్ గెహాని, నెం.17 స్క్వాడ్రన్ “గోల్డెన్ ఆరోస్” కమాండింగ్ ఆఫీసర్ నడిపారు.

గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ అంటే

ఇది భారత వైమానిక దళంలోని ప్రసిద్ధ యూనిట్‌లలో ఒకటి. ఇంతకుముందు మిగ్-21 టైప్ 96 యుద్ధవిమానాలను నడిపేది. పంజాబ్‌లోని భిషియానా ఎయిర్‌బేస్ నుంచి 1999 కార్గిల్ యుద్ధ సమయంలో రికానైసెన్స్, స్ట్రైక్ మిషన్‌లలో పాల్గొంది. ఇప్పుడు అదే స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను నడుపుతోంది.

ద్రౌపది ముర్ము రఫేల్‌లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతి గా నిలిచారు. కానీ, ముందు మరికొంతమంది రాష్ట్రపతులు ఇతర యుద్ధ విమానాల్లో సార్టీలు (sorties) చేశారు.

భారత రాష్ట్రపతులు, యుద్ధవిమానంలో ప్రయాణాల చరిత్ర

ద్రౌపది ముర్ము (2023,2025)

2023 ఏప్రిల్ 8న — సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానంలో తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ (అస్సాం) నుంచి ప్రయాణించారు.

2025 అక్టోబర్ 29న — రఫేల్ యుద్ధవిమానంలో అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ (హర్యానా) నుండి చారిత్రాత్మక సార్టీ చేశారు.

రఫేల్‌లో ప్రయాణించిన మొదటి భారత రాష్ట్రపతి.

ప్రణబ్ ముఖర్జీ (2013)

2013 లో సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానంలో పూణేలోని లోహేగావ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ నుంచి ప్రయాణించారు.

సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతి.

ఏ.పీ.జే. అబ్దుల్ కలాం (2003)

ఆయన కూడా సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ లో ప్రయాణించారు.

మాజీ శాస్త్రవేత్తగా వైమానిక శక్తిపై ఆసక్తి చూపారు. అలాగే మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండిస్, మాజీ ఎయిర్ చీఫ్‌లు తరచూ ఇలాంటి సార్టీలు చేశారు.

ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం ప్రయాణించిన విమానాలు, ద్రౌపది ముర్ము ప్రయాణించిన రఫేల్ ఇవన్నీ యుద్ధవిమానాలే అయినా, వాటి సాంకేతికత, తరం, సామర్థ్యం లో చాలా తేడాలు ఉన్నాయి.

రఫేల్ యుద్ధవిమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం - Tholi Paluku