Let's talk: editor@tmv.in
రన్నరప్‌ సాత్విక్‍- చిరాగ్ జోడీ

రన్నరప్‌ సాత్విక్‍- చిరాగ్ జోడీ

Shaik Mohammad Shaffee
22 సెప్టెంబర్, 2025

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలకు నిరాశ ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో వారు పోరాడి ఓడిపోయారు. ప్రపంచ ఛాంపియన్‌లు అయిన కొరియా జోడీ కిమ్ వోన్-హో, సియో సియుంగ్-జాయ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

చైనాలోని షెన్‌జెన్ అరేనాలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ప్రపంచ నంబర్ వన్, ఇటీవల ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన కొరియా జోడీ కిమ్ వోన్-హో, సియో సియుంగ్-జాయ్‌తో తలపడింది. భారత జోడీ గట్టిగా పోరాడినా, చివరికి 19-21, 15-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ 45 నిమిషాల పాటు జరిగింది.

గత వారం హాంకాంగ్ ఓపెన్ 2025లో కూడా ఈ జోడీ రన్నరప్‌గా నిలిచింది. అక్కడ చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌ల చేతిలో ఓడిపోయారు. ఆగస్టు చివరిలో జరిగిన బీడబ్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా సెమీ ఫైనల్‌లో చైనా జోడీ చెన్ బో యాంగ్, లియు యి చేతిలో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

మ్యాచ్ సాగింది ఇలా

ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‌లో కొరియా జోడీ 0-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, సాత్విక్-చిరాగ్ వెంటనే పుంజుకుని 3-3తో స్కోరును సమం చేశారు. దూకుడుగా ఆడిన భారత జోడీ 10-7 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 14-7తో మంచి పట్టు సాధించారు. అయితే అనవసరపు తప్పిదాల వల్ల కొరియా జోడీ మళ్లీ పుంజుకుని 15-15తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 18-19తో ఆధిక్యం సాధించి తొలి గేమ్ గెలుచుకుంది.

రెండో గేమ్ కూడా దాదాపుగా మొదటి గేమ్‌లాగే సాగింది. సాత్విక్-చిరాగ్ 8-6తో స్వల్ప ఆధిక్యం సాధించారు. కానీ మరోసారి కొరియా షట్లర్లు ఆటను తమ వైపు తిప్పుకున్నారు. చివరకు సాత్విక్ రిటర్న్ సర్వ్ పొడవుగా వెళ్లడంతో కిమ్-సియో జోడీకి స్వర్ణ పతకం దక్కింది. దీంతో భారత జోడీ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ టోర్నమెంట్లో సాత్విక్‍-చిరాగ్ జోడీ ప్రదర్శన గొప్పగానే ఉంది. సెమీ ఫైనల్‌లో మలేషియాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఆరోన్ చియా, సోహ్ వూయి యిక్‌లను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో వారి ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ జోడీ అయిన కిమ్-సియో జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. ఈ ఓటమి సాత్విక్-చిరాగ్ జోడీకి బాధ కలిగించినా, రానున్న టోర్నీల్లో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

రన్నరప్‌ సాత్విక్‍- చిరాగ్ జోడీ - Tholi Paluku