
రన్నరప్గా లక్ష్యసేన్, సాత్విక్ జోడీ
హాంకాంగ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చైనా ఆటగాళ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇద్దరు రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
లక్ష్యసేన్ పోరాటం వృథా
పురుషుల సింగిల్స్ ఫైనల్లో పారిస్ 2024 సెమీ ఫైనలిస్ట్ అయిన లక్ష్యసేన్, ఆసియా క్రీడల ఛాంపియన్ అయిన లీ షీ ఫెంగ్ చేతిలో 15-21, 12-21 తేడాతో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న లీ షీ ఫెంగ్ను ఎదుర్కోవడంలో లక్ష్యసేన్ విఫలమయ్యాడు. మొదటి గేమ్లో లక్ష్యసేన్ మంచి ఆరంభం ఇచ్చినా, కొన్ని పొరపాట్లు చేశాడు. దీనిని అవకాశంగా తీసుకున్న లీ షీ ఫెంగ్ అద్భుతంగా ఆడుతూ మొదటి గేమ్ను సులభంగా గెలుచుకున్నాడు. రెండో గేమ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. లక్ష్యసేన్ 4-1తో ఆధిక్యంలో ఉన్నా, లీ షీ ఫెంగ్ తిరిగి పుంజుకుని మ్యాచ్పై పట్టు సాధించాడు. కేవలం 45 నిమిషాల్లోనే ఫైనల్ను ముగించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ ఓటమితో లక్ష్యసేన్, లీ షీ ఫెంగ్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు 7-7తో సమమైంది. ఈ ఓటమి లక్ష్యసేన్కు నిరాశ కలిగించినా, గతేడాది సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గెలిచిన తర్వాత ఆయన ఒక బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్కు చేరుకోవడం ఇదే తొలిసారి.
సాత్విక్-చిరాగ్ జోడీకి పరాజయం
పారిస్ 2024 రజత పతక విజేతలు, చైనాకు చెందిన లియాంగ్ వీకెంగ్-వాంగ్ చాంగ్ జోడీ చేతిలో సాత్విక్-చిరాగ్ జోడీ 21-19, 14-21, 17-21 తేడాతో ఓడిపోయారు. గతేడాది థాయ్లాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత ఈ జోడీకి ఇదే మొదటి ఫైనల్. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి గేమ్లో భారత జోడీ 17-13తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చైనా జోడీ 17-17తో స్కోరును సమం చేసింది. కానీ సాత్విక్-చిరాగ్ పోరాడి మొదటి గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో చైనా జోడీ దూకుడు పెంచి భారత జోడీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్లో లియాంగ్ వీకెంగ్-వాంగ్ చాంగ్ జోడీ ప్రారంభంలోనే 6-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఒక గంటకు పైగా సాగిన ఈ మ్యాచ్లో చివరగా భారత డబుల్స్ జోడీ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ ఏడాది బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్ను గెలిచిన ఏకైక భారత ఆటగాడు ఆయుష్ శెట్టి. అతడు యూఎస్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. అయితే హాంకాంగ్ ఓపెన్లో ఆయుష్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యసేన్ చేతిలో ఓడిపోయాడు.
