Let's talk: editor@tmv.in
రథసప్తమి విశిష్ట కథనం

రథసప్తమి విశిష్ట కథనం

Dantu Vijaya Lakshmi Prasanna
25 జనవరి, 2026

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని పెద్దల మాట. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ఆదిత్యుడు. అటువంటి సూర్య భగవానుడు జన్మించిన పవిత్ర దినమే రథసప్తమి. దీనినే మాఘ సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, అరిసవల్లి వంటి క్షేత్రాలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

2026లో రథ సప్తమి, జనవరి 25, 2026 ఆదివారం, అనగా నేడు జరుపుకుంటుండగా, మాఘ శుక్ల సప్తమి తిథి, శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభమై, నేటి రాత్రి 9 గంటల తర్వాత ముగుస్తుంది.

రథసప్తమి పురాణ నేపథ్యం

పురాణాల ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే ఈ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు పద్మరాగ మణి ప్రభలతో, కిరణాత్మకమైన తేజస్సుతో ఉదయించి లోక కల్యాణానికి కారకుడయ్యాడు.

మరో కథనం ప్రకారం, కాంబోజ దేశాన్ని పాలించే యశోవర్మ అనే రాజుకు సంతానం లేక అనేక పూజలు చేశాడు. చివరకు ఒక కుమారుడు జన్మించినప్పటికీ, ఆ బాలుడు అనారోగ్యంతో బాధపడేవాడు. అప్పుడు ఒక ముని సలహా మేరకు, ఆ బాలుడి చేత రథసప్తమి వ్రతాన్ని చేయించగా, పూర్వజన్మ పాపాలు తొలగి ఆ కుమారుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ కథ రథసప్తమి పూజ యొక్క శక్తిని చాటి చెబుతుంది.

సూర్య రథం: ఖగోళ, ఆధ్యాత్మిక సంకేతాలు

సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని "హిరణ్యయేన సవితారథేన" అని వేదము తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు ఉంటాయి. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు.

రథసప్తమి అంటే సూర్యుడు తన దిశను మార్చుకుని, తన రథాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం వైపు మళ్లించే రోజని అర్థం. సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు సంకేతం. శాస్త్రీయంగా ఇవి కాంతిలోని ఏడు రంగులను సూచిస్తాయి. ఈ రథానికి ఉండే 12 చక్రాలు ఏడాదిలోని 12 రాశులను సూచిస్తాయి. సూర్యుడి రథ సారథి అనూరుడు (అరుణుడు). అందుకే సూర్యోదయానికి ముందే వచ్చే ఎర్రని కాంతిని అరుణోదయం అంటారు.

జిల్లేడు ఆకుల స్నానం - శాస్త్రీయ కోణం

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,

అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.

మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,

కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.

రథసప్తమి రోజున నదీ స్నానం లేదా ఇంటి వద్ద స్నానం చేసేటప్పుడు జిల్లేడు (అర్క) ఆకులను ధరించడం ప్రధాన ఆచారం. ఏడు జిల్లేడు ఆకులను (ఒకటి తల మీద, రెండు భుజాల మీద, రెండు మోకాళ్ల మీద, రెండు పాదాల మీద) ఉంచుకుని స్నానం చేయాలి.

దీని అధ్యాత్మిక అర్థం ఏమిటంటే "అర్క" అంటే కిరణం అని కూడా అర్థం. జిల్లేడు ఆకు సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ ఆకులతో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు తొలగిపోతాయని, గత ఏడు జన్మల పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

భారతదేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాలు:

కోణార్క్ సూర్య దేవాలయం (ఒడిశా) - ప్రపంచ వారసత్వ ప్రదేశం.

ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన అద్భుత కట్టడం మరియు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. గంగ వంశపు రాజు మొదటి నరసింహదేవ నిర్మించిన ఈ ఆలయం, ఏడు గుర్రాలు లాగుతున్న 24 చక్రాల భారీ రాతి రథం ఆకారంలో ఉంటుంది. ఈ చక్రాలు కేవలం అలంకారం మాత్రమే కాదు, ఇవి సూర్యకిరణాల నీడను బట్టి కచ్చితమైన సమయాన్ని చూపే 'సన్ డయల్స్' (ఎండ గడియారాలు) గా పనిచేయడం విశేషం. కాలక్రమేణా ప్రధాన ఆలయం కొంత శిథిలమైనప్పటికీ, ఇక్కడి శిల్పకళా నైపుణ్యం మరియు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం నేటికీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తుంది.

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం (ఆంధ్రప్రదేశ్).

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన సూర్య క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ రాజు దేవేంద్ర వర్మ నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలల్లో సూర్య కిరణాలు నేరుగా గర్భాలయంలోని మూలవిరాట్టు పాదాలను తాకుతాయి, ఇది అప్పటి శిల్పుల అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. రథసప్తమి పండుగను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు; ఆ రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందాలని ప్రార్థిస్తారు.

మోధేరా సూర్య దేవాలయం (గుజరాత్).

గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో పుష్పవతి నది ఒడ్డున ఉన్న మోధేరా సూర్య దేవాలయం సోలంకి వంశపు రాజు మొదటి భీమ్‌దేవ్ కాలంలో (క్రీ.శ. 1026-27) నిర్మించబడిన అద్భుత కట్టడం. ఈ ఆలయం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఎటువంటి సిమెంట్ లేదా సున్నం వాడకుండా కేవలం రాళ్లను ఒకదానికొకటి అమర్చే 'లాకింగ్ సిస్టమ్' ద్వారా నిర్మించారు. గర్భాలయం వెలుపల ఉన్న 'సూర్యకుండ్' అనే భారీ కోనేరు, దాని చుట్టూ ఉండే 108 చిన్న చిన్న గుడులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. సూర్య కిరణాలు నేరుగా గర్భాలయంలో పడేలా ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్మించిన ఈ ఆలయం, ప్రస్తుతం పూజలు జరగకపోయినా, భారతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా మరియు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిన చారిత్రక సంపదగా నిలుస్తోంది.

తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం

ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో రథసప్తమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనిని "ఒక్క రోజు బ్రహ్మోత్సవం" అని పిలుస్తారు. ఈ రోజున మలయప్ప స్వామి వారు ఉదయం నుండి రాత్రి వరకు ఏడు విభిన్న వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు

మొదటిగా సూర్యప్రభ వాహనంలో, సూర్యోదయ వేళ స్వామి వారు సూర్యకాంతిలో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తారు. తరువాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, మద్యలో చక్రస్నానం (స్వామి వారి చక్రత్తాళ్వార్‌కు పవిత్ర పుష్కరిణిలో స్నానం చేయిస్తారు), తరువాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, అనంతరం చంద్రప్రభ వాహనం ఉంటాయి. రాత్రి వేళ వెన్నెల కాంతిలో చంద్రప్రభ వాహనంపై స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఒకే రోజులో ఇన్ని వాహన సేవలు చూడటం భక్తులకు కనువిందుగా ఉంటుంది.

ఆరోగ్య ప్రదాయిని: సూర్యారాధన

సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఈ పండుగ చలికాలం ముగిసి, వసంతకాలం రాకను సూచిస్తుంది. భారతీయ రైతులు ఈ రోజును వ్యవసాయ పనులకు శుభారంభంగా భావిస్తారు.

రథసప్తమి నాడు ఇంటి ముందు ఆవు పేడతో పొయ్యి పెట్టి, చిక్కుడు ఆకులతో పందిరి వేసి, పాలు పొంగించి పరమాన్నం వండుతారు. దీనిని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ రోజున 'ఆదిత్య హృదయం', 'సూర్యాష్టకం', 'గాయత్రీ మంత్రం' పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక శక్తి లభిస్తాయని నమ్మకం. రథసప్తమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే రోజు. సూర్యుడి కిరణాల ద్వారా మనకు అందే ప్రాణశక్తిని గౌరవిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడమే ఈ పండుగ వెనుక ఉన్న అంతరార్థం.

"ఓం సూర్యాయ నమః"