
‘రీతూ సాహూ' కేసులో సీబీఐ దూకుడు
పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతూ సాహూ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కుమార్తెది అనుమానాస్పద మృతి కాదని, హత్యేనంటూ రీతూ సాహూ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఏపీతో పాటు బెంగాల్ సీఎంకూ లిఖిత పూర్వక ఫిర్యాదిచ్చారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ క్రమంలో గురువారం సీబీఐ అధికారులు విశాఖ పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో సోదాలు నిర్వహించారు.
మరణ ధ్రువీకరణ పత్రం మంజూరుపై ఆరా
విద్యార్థిని మరణ ధృవీకరణ పత్రం మంజూరుపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అప్పట్లో అరుగురు వైద్యుల బృందం ఇచ్చిన తప్పుడు రిపోర్టుపై ధృవీకరణ పత్రం ఎలా మంజూరు చేశారంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. డీసీఎస్-ఆర్ఎంవో ఇవ్వాల్సిన నివేదికను ఒక జూనియర్ వైద్యుడు ఇవ్వడంపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అప్పటి సూపరింటెండెంట్ పేషీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ ఏ విధంగా సంతకం చేశారంటూ విచారించినట్టు తెలుస్తోంది. మరోమారు పూర్తిస్థాయిలో సీబీఐ అధికారులు నివేదిక కోరినట్టు తెలిసింది. అదే విధంగా ప్రాథమిక వైద్యం అందించిన ఆస్పత్రిని ఎందుకు తనిఖీ చేయలేదంటూ ప్రశ్నించారని సమాచారం. ఇంటర్ విద్యార్థిని రీతూ సాహూ పోస్టుమార్టం డేటాను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారని తెలిసింది.
