
రైతులపై ‘నిశ్శబ్ద’ దండయాత్ర
పార్వతీపురం – మన్యం జిల్లాలోని పంట పొలాల్లో రైతులు ఊహించని శత్రువుతో పోరాడుతున్నారు. అది కరువు కాదు, అడవి జంతువులు కాదు… ఆఫ్రికన్ భారీ నత్తలు. వర్షాకాలంలో తోటల్లో కనబడే సాధారణంగా కనిపించే ఈ నత్తలే ఇప్పుడు
రైతుల పాలిట నిశ్శబ్ద శత్రువులుగా మారాయి.
విపత్తు ఎలా మొదలైంది?కొమరాడ మండలంలో జూన్‌లో తొలిసారి కనబడిన ఈ నత్తలు, కొద్ది రోజుల్లోనే విస్తృతంగా పెరిగాయి. బొప్పాయి, జామ, టమాట, బెండకాయ, క్యాబేజీ పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. నిపుణులు వీటిని అచాటినా ఫులికా జాతికి చెందిన “జెయింట్ ఆఫ్రికన్ స్నెయిల్”గా గుర్తించారు. ఇవి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 100 జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ప్రతి నత్త ఏడాదికి సగటున వెయ్యి వరకు గుడ్లు పెట్టగలవు. వీటి ఆయుష్షు ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది.
భారీ నష్టంఈ నత్తల దాడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను దాటి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వరకు విస్తరించింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో సోయాబీన్, పత్తి పంటలు 72 వేల హెక్టార్ల వరకు ప్రభావితమయ్యాయి. కాఫీ తోటలు, కేరళలోని పంటలు కూడా నష్టపోతున్నాయి. గంగిరేగువలసకు చెందిన రైతు బాబు మాట్లాడుతూ.. లక్షల విలువైన బొప్పాయి, జామ పంటలు నాశనం అయ్యాయని చెప్పుకున్నారు. నత్తలను తాము చేతితో ఏరివేయాల్సి వస్తోందని.. కొన్ని సార్లు కూలీలను పెట్టి ఎరిస్తున్నామని చెప్పారు. తమకు అదనంగా డబ్బు ఖర్చు అవుతోందని చెప్పారు.
నత్తల దాడులతో రైతు ఆదాయంలో 50–60% వరకు నష్టం వస్తున్నట్టు తెలుస్తోంది. .
ఎక్కడి నుంచి వచ్చాయి?ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా స్పష్టత లేదు. ఒడిశా నుంచి వరదలో కొట్టుకొని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా కేరళ నుంచి తెచ్చిన సుపారీ మొక్కలతో గుడ్లు చేరి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. శతాబ్దం క్రితం అలంకార జంతువులుగా ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఈ నత్తలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి.
ఎందుకు ఇప్పుడే ముప్పు? గత కొన్ని ఏళ్లుగా అధిక వర్షాలు, తడి వాతావరణం, వేడి శీతాకాలాలు వీటి పెరుగుదలకు అనుకూలించాయి. రాష్ట్రాల మధ్య మొక్కల రవాణా పెరగడంతో వీటి గుడ్లు కొత్త ప్రాంతాలకు చేరాయి. ఫలితంగా 2024–25లో పెద్ద ఎత్తున వ్యాప్తి సాధించాయి. ఈ రాకాసి నత్తలు 500 కంటే ఎక్కువ రకాల పంటల ఆకులు, కాండం, మొగ్గలను తింటాయి. ఈ నత్తలు శిలీంధ్రాల పెరుగుదలకు దారి తీస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. స్థానిక జీవవైవిధ్యాన్నీ నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా పరాన్నజీవులను మోసుకెళ్లి మానవులకు మెనింజైటిస్ వంటి వ్యాధులను కలిగించే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ చర్యలుమన్యం జిల్లా అధికారులు రైతులకు చేతితో ఏరుకోవాలని, గన్నెపూల బస్తాలు ఉంచి వాటిపై ఉప్పు చల్లి బంధించాలని సూచించారు. అదనంగా మెటాల్డిహైడ్ పెళ్ళెట్లు వాడమని సూచనలు జారీ చేశారు. అయితే తాత్కాలిక నివారణకే ఇవి ఉపయుక్తమని, సమగ్ర చర్యలే శాశ్వత పరిష్కారమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేరళ మోడల్ కేరళలో పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచార కార్యక్రమాలు వీటి నియంత్రణలో విజయవంతమయ్యాయి. పాఠశాలలు, గ్రామాలలో అవగాహన కల్పించడం, వారానికి ఒక రోజు సామూహిక శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించడం, ఎక్కువగా తేళ్లు ఏరిన కుటుంబాలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం వంటి చర్యలు ఫలితాలిచ్చాయి. పొలాల్లో బాతులు పెంచడం ద్వారా ఈ రకమైన నత్తలు, వాటి గుడ్లను నివారించుకోవచ్చు. రైతులకు బాతు గుడ్లు, మాంసం ద్వారా అదనపు ఆదాయమూ వస్తుంది. “రైతుల, గ్రామాల, ప్రభుత్వాల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర యత్నమే ఈ ఆఫ్రికన్ తేళ్ల విపత్తును అడ్డుకోగలదు” అని నిపుణులు అంటున్నారు.
