Let's talk: editor@tmv.in
రైతులకు బోనస్ ఎప్పుడిస్తారు?

రైతులకు బోనస్ ఎప్పుడిస్తారు?

Aravind Maryada Reddy
26 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో ఆ నగదు జమ చేయలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై కవిత స్పందించారు. సన్నవడ్లకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ట్వీట్ చేశారు.యాసంగి (రబీ) సీజన్‌లో సన్నవడ్లు పండించి అమ్మిన రైతులు ఇప్పుడు వానాకాలం (ఖరీఫ్) పంటల సాగుకు అదనపు పెట్టుబడులు చేస్తున్నారు. కానీ బోనస్ ఆలస్యంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. 'సోనియా మ్మ గ్యారెంటీ'గా ప్రకటించిన ఈ హామీ 'వంచన'గా మారిపోయిందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది.

బోనస్ మీదే ఆశలు

తెలంగాణలో సన్నవడ్ల సాగు చేసే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024-25 యాసంగి సీజన్‌లో మొత్తం సన్నవడ్ల సాగు 61 శాతం పెరిగింది. రూ.500 బోనస్ ఇస్తారన్న ఆశతోనే రైతులు సన్న వడ్లు సాగు చేశారు. కానీ ధాన్యం కొనుగోలు ముగిసిన నాలుగు నెలల తర్వాత కూడా బోనస్ డబ్బులు రాలేదు. "సన్నవడ్లు పండించడానికి అదనపు పెట్టుబడి, కష్టాలు చేశాం. మద్దతు ధరకు అమ్మాం. కానీ బోనస్ ఇవ్వకపోతే ఏమిటి లాభం? వానాకాలం పంటలకు డబ్బు లేకుండా ఎలా సాగు చేస్తాం?" అని నల్గొండ జిల్లాకు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రైతులు ఆందోళనలు కూడా నిర్వహించారు. మూడు నెలలు గడిచినా పైసా ఒక్కటి రాలేదని, ఇది 'కాంగ్రెస్ మార్క్ మోసం' అని ఆరోపిస్తున్నారు.

అప్పుల భారంతో ఆలస్యం?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు భారీ నిధులు ఖర్చు చేస్తోంది. 2025 బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ.22,856 కోట్లు కేటాయించారు. ఇందులో రైతు భరోసా, పింఛన్లు, వంటి పథకాలు ఉన్నాయి. "బోనస్ ఇవ్వడం మా లక్ష్యమే. కానీ ఆర్థిక ఒత్తిడితో కొంచెం ఆలస్యం అయింది. త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం" అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. 4 లక్షల మంది రైతులను ఈ అంశం ప్రభావితం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ల పంపిణీ, యూరియా సరఫరాలో ఆలస్యాలు కూడా రైతుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. వెయ్యి కోట్ల పైచిలుకు రైతులకు బోనస్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.

హామీలు 'కష్టసాధ్యం'గా మారాయా?

బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నా. తాజాగా కవిత కూడా ఇదే అంశంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో 'సోనియా గ్యారెంటీ' అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు" అని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాగా ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పాలనలో రైతులకు పూర్తి మద్దతు ఉండేదని, కాంగ్రెస్ హామీలు అమలు చేయడం మారాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక భారం. పింఛన్లు, ఇతర సంక్షేమాలకు డబ్బులు సరిపోవడం లేదు. "కొత్త హామీలు తలనొప్పిగా మారాయి. కానీ రైతు సంక్షేమమే మా ధ్యేయం" అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత

ఈ బోనస్ ఆలస్యం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ముఖ్యం. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ అసంతృప్తి ప్రభావం చూపే అవకాశం ఉంది. "హామీల అమలు కష్టసాధ్యంగా మారిపోయింది. రైతులకు బోనస్ ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం" అని రైతు సంఘాలు ప్రకటించాయి. మరోవైపు, ప్రభుత్వం త్వరలో డబ్బు విడుదల చేస్తుందని ఆశలు కలిగిస్తోంది. రైతులు, ప్రభుత్వం మధ్య ఈ ఘర్షణ ఎలా ముగుస్తుందో చూడాలి.

రైతులకు బోనస్ ఎప్పుడిస్తారు? - Tholi Paluku