Let's talk: editor@tmv.in
రోడ్డుపాలైన ‘యాపిల్’ రైతుల కష్టం

రోడ్డుపాలైన ‘యాపిల్’ రైతుల కష్టం

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

‘మా కళ్ల ముందే మేం చేసిన కష్టం వథాగా మారిపోతుంటే చాలా బాధగా ఉంది. ఈ సంవత్సరం యాపిల్ పంట బాగా వచ్చింది. లోయలోని రైతుల కష్టాలు తీరుతాయనుకున్నాం. కానీ రహదారులు మూసివేయడం వల్ల అందరం నష్టపోయాం’ అని బారాముల్లాకు చెందిన అల్తాఫ్ అహ్మాద్ అనే రైతు ఆవేదన చెందారు. కశ్మీర్ లో యాపిల్ పండించిన ప్రతి రైతు పరిస్థితి ఇదే.

భారీ వర్షాలతో జమ్ము-శ్రీనగర్ నేషనల్ హైవేను ఆగష్టు 25 నుంచి మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాకపోకలు ప్రారంభం కాలేదు. అయితే ఆ హైవేపై కిలోమీటర్ల మేర యాపిల్ పండ్లతో నిండిన 2000-3000 ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో అందులోని యాపిల్స్ కుళ్లిపోయి సుమారు రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు వ్యాపారస్తులు, రైతులు చెబుతున్నారు. దీని వల్ల ఉపాధి కూడా దెబ్బతింటుందని వాపోతున్నారు.

రైలు ప్రారంభం

యాపిల్స్ ను ఇతర ప్రాంతాలకు చేర్చడానికి రైలు సేవలను ప్రారంభించినప్పటికీ కేవలం కొంత సరుకు మాత్రమే వెలుతుందని, మిగతా సరుకు మిగిలిపోతుందని అన్నారు. రోజు దేశవ్యాప్తంగా 1000 ట్రక్కుల యాపిల్స్ రవాణా జరుగుతుందని కాశ్మీర్ వ్యాలీ పండ్ల వ్యాపార సంఘం అధ్యక్ష్యుడు బషీర్ అహ్మద్ తెలిపారు. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులని, దాదాపు 20 రోజులుగా ట్రక్కుల్లోనే ఉండడం వల్ల 30 లక్షల యాపిల్ బాక్సులు చెడిపోయి ఉండవచ్చునని వాపోయారు. రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అవసరమైతే సైన్యం సేవలను వినియోగించుకుని రోజురోజూకు నష్టపోతున్న అన్నదాతలను, వ్యాపారులను ఆదుకోవాలని కోరారు.

తక్షణ చర్యలు తీసుకోవాలి

భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడినప్పటి నుంచి కాశ్మీర్ ప్రజల జీవనాధారమైన ఈ నేషనల్ హైవే 44 ను మూసివేయడం బాధకరం. అయితే రోడ్డు నిర్మాణ పనులను ఆధునిక యంత్రాలతో చేపట్టాలని ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ కోరారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ విషయంలో కలుగజేసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. లేకుంటే ప్రజలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నారు. ఇంకా తొటల్లో కూడా యాపిల్స్ మురిగిపోతున్నాయని ఆవేదన చెందారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి 20-25 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ ఉత్పత్తి అవుతాయని గుర్తు చేశారు. ఈ పండ్ల రవాణా మొత్తం జాతీయ రహదారిపైనే ఆధారపడి ఉందని తెలిపారు.

ఫోటో రైటప్; నిరసన తెలియజేస్తున్న యాపిల్ వ్యాపారులు

రోడ్డుపాలైన ‘యాపిల్’ రైతుల కష్టం - Tholi Paluku