Let's talk: editor@tmv.in
రాజస్థాన్‌లో జీవీఎంసీ విహారం

రాజస్థాన్‌లో జీవీఎంసీ విహారం

FL - YUGDR
24 సెప్టెంబర్, 2025

అధ్యయన యాత్ర పేరిట శాఖ కార్పొరేటర్లు విహారయాత్ర జోరుగా సాగిస్తున్నారు. ఒక వైపు ఆపరేషన్ లంగ్స్ పేరిట జీవీఎంసీ విశాఖ సిటీలో పేదల జీవితాలపై గునపం గుచ్చుతుంటే.. మరోవైపు ప్రజల కట్టే పన్నులతో కార్పొరేటర్లు రాజస్థాన్ లో షికార్లు చేస్తున్నారు. అధ్యయన యాత్ర పేరుతో జైపూర్, జోధ్ పూర్, రాజస్థాన్ కు కార్పొరేటర్లు షికార్లకెళ్లారు. వాళ్ళు చేస్తున్నది అధ్యయన యాత్రో, ప్రజల సొమ్ముతో వృథా యాత్రో పై ఫోటో చూస్తే మీకే అర్థమైపోతుంది.

ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు 97మంది కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులతో పాటు వారి బంధువులు, కుటుంబ సభ్యులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది అధ్యయన యాత్రకు బయల్దేరిన విషయం తెల్సిందే. విశాఖలో ఆక్రమణల తొలగింపు అంటూ చిరు వ్యాపారుల పొట్ట గొడుతుంటే ఒక్క కార్పొరేటర్ కూడా ఇది హేయమైన చర్య అంటూ కనీసం స్టేట్ మెంట్ కుడా ఇవ్వలేదు. కూటమి తీరు సరే.. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష వైసీపీ కార్పొరేటర్లు కూడా తానా తందానా అంటున్నారు. ఈ యాత్ర తగదు అంటూ సీపీఎం గంగారాం, జనసేన తరపున పీతల మూర్తి యాదవ్ టూర్ కు వెళ్ళలేదు. మరో 10మంది వరకు వివిధ కారణాలతో యాత్రకు తొలుత బయల్దేరలేదు.

జీవీఎంసీ నిధుల నుంచి ఈ ఏడాది 1కోటీ 53లక్షల 99 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది కాకుండా అనధికారికంగా మరో రూ.1కోటి వరకు వివిధ విభాగాల నుంచి వసూలు చేసినట్టు తెల్సింది. గత వైసీపీలోనూ, ఇప్పటి కూటమి కార్పొరేటర్లు చేసిన అధ్యయన యాత్ర ఫలితాలేంటో వాళ్ళకే తెలియాలి. నాలుగు యాత్రలు చేసినా ప్రజాధనం వృథా తప్పితే ఇంకేమీ లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. తొలి యాత్ర 2022లో చేపట్టగా రూ.1.కోటి వరకు దండగే అయింది. 2023లో రూ.1.15కోట్లు, 2024లో 1.40కోట్లు, తాజాగా ఈ ఏడాది రూ.1.54కోట్ల ఖర్చు అంటూ పద్దు రాసేశారు.

మరో వైపు జీవీఎంసీ కమిషనర్ చర్యలతో వైజాగ్ లో గత నాలుగు రోజుల నుంచీ పేదలకు కంటి మీద కునుకు లేదు. మరి రాజస్థాన్లో చిందులేస్తున్న ఈ కార్పొరేటర్లు టూర్ నుంచి తిరిగొచ్చాక తమకు ఓట్లేసిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే. యాత్ర జరుగుతుండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు పర్యాయాలు విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ రెండుసార్లు మేయర్ పీలా శ్రీనివాసరావు విహారయాత్రలోనే మునికి తేలేరు. కార్పొరేటర్లను రాజస్థాన్లో దింపి తిరిగి వస్తానని చెప్పిన ఆయన అక్కడే వారితోనే ఉండిపోయారు.

రాజస్థాన్‌లో జీవీఎంసీ విహారం - Tholi Paluku