Let's talk: editor@tmv.in
రాజమహేంద్రవరం- తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు

రాజమహేంద్రవరం- తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు

Shaik Mohammad Shaffee
21 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులు రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నాయి. కేంద్రం సహకారంతో మరిన్ని నగరాలను అనుసంధానించేలా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాల మధ్య విమాన సేవలు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ఈ నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ ఏటీఆర్ 72 విమాన సర్వీసులు ప్రారంభించబడతాయన్నారు.

విమాన షెడ్యూల్

రాజమహేంద్రవరం-తిరుపతి విమానానికి సంబంధించిన షెడ్యూల్‌ని కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. అక్టోబర్ 1న ఉదయం 9:25 గంటలకు విమానం తిరుపతి నుండి రాజమహేంద్రవరం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:15 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరుతుంది. అక్టోబర్ 2 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు నడుస్తాయి. ఈ నూతన సర్వీసు ఉదయం 7:40 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, తిరిగి ఉదయం 9:50 గంటలకు రాజమహేంద్రవరం నుండి బయలుదేరుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ కొత్త సర్వీసు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అనేక మంది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ అనే ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అలయన్స్ ఎయిర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

రాజమహేంద్రవరం- తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు - Tholi Paluku