Let's talk: editor@tmv.in
రజిని, కమల్ ప్రాజెక్ట్ కు కొత్త డైరెక్టర్ ఎవరో ?

రజిని, కమల్ ప్రాజెక్ట్ కు కొత్త డైరెక్టర్ ఎవరో ?

Thaduri Lalitya
19 సెప్టెంబర్, 2025

కోలీవుడ్ లెజెండ్స్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సినీ స్టార్లు ఎవరంటే టక్కున చెప్పే పేర్లు రజినీకాంత్, కమల్ హాసన్. కొంతకాలంగా వీరిద్దరికి సంబంధించి ఒక వార్త నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుంది. ఎందుకు ఆ వార్త అంత స్పెషల్ అంటే దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ , తలైవా ఒకే తెరపై కలిసి నటించబోతున్నారని న్యూస్ సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే నిర్వహించిన సైమా అవార్డ్స్ వేదిక పై కమల్ హాసన్ కూడా ఈ కాంబినేషన్ లో సినిమా గురించి మాట్లాడుతూ, ‘మా కాంబినేషన్ని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఫలించలేదు. అయితే ఈసారి తప్పక కలసి వస్తాం. ఇక ఫ్యాన్స్ కు పండగే అన్నట్టు గా గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో రజినీ, కమల్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వచ్చిన పుకార్లను ఖండిస్తూ, మా మధ్య ఎలాంటి తేడాలు లేవు. ఇవన్నీ ఊహాగానాలే, మేమెప్పుడూ ఒకరిని ఒకరు పోటీగా చూడలేదు అని కమల్ హాసన్ స్పష్టం చేశారు. రజినీకాంత్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చారు.

రజినీకాంత్ తన తాజా వ్యాఖ్యల్లో, తన నెక్స్ట్ మూవీ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ (కమల్ హాసన్ సంస్థ, రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్ సంస్థ) సంయుక్తంగా నిర్మించనున్నారని ప్రకటించారు. అయితే కథ, కథనం పూర్తిగా సిద్ధమైన తర్వాతే అధికారిక వివరాలు బయటికి వస్తాయని తెలిపారు. కమల్తో కలిసి నటించాలని నేను ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నా, కానీ సరైన కథ దొరికితే ముందుకు వెళ్తాం అన్నారు రజినీకాంత్.

ఈ భారీ మల్టీస్టారర్ను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడని కొంతకాలంగా బలమైన ప్రచారం సాగుతోంది. కమల్ హాసన్ నటించిన “విక్రమ్” విజయంతో పాటు, రజినీకాంత్ నటించిన కూలీ పై ఏర్పడిన భారీ అంచనాలే ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. కానీ, రజినీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో దర్శకుడు ఇంకా ఖరారు కాలేదనే విషయం తేలిపోయింది. కానీ ఇండస్ట్రీ వర్గాల గుసగుసల ప్రకారం ఈ ఫేమస్ కాంబో సినిమా డైరెక్షన్ ఓ కొత్త డైరెక్టర్ చేతిలో పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చూడాలి, అభిమానుల ఆశ తీరడానికి ఇంకెంత సమయం పడుతుందో మరి.

రజిని, కమల్ ప్రాజెక్ట్ కు కొత్త డైరెక్టర్ ఎవరో ? - Tholi Paluku