
రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు వస్తేనే చర్చ: మల్లు రవి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేయడం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు వస్తే చర్చిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికి రాజగోపాల్ రెడ్డి పై ఎలాంటి ఫిర్యాదులు రాలేవని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. అలాగే, సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈ విషయంపై నర్సారెడ్డిని వివరణ ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. పూజల హరికృష్ణపై ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానించామని తెలిపారు. ఏ పార్టీ నాయకులు, కార్యకర్తలైన కాంగ్రెస్ లో చేరావచ్చని సూచించారు. నేతలు మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మాజీమంత్రి కేటీఆర్ తను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు. కొందరు కేటీఆర్ రాజకీయ నాయకుడు అని మాట్టాడుతున్నారు.
కేటీఆర్ రాజకీయ నాయకుడు అయితే తాము సన్యాసులమా? అని ఫైర్ అయ్యారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. అప్పుడు లేని రాజీనామాలు, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే కేటీఆర్కు అంత ఇబ్బంది ఎందుకని మల్లు రవి ప్రశ్నించారు. గత పదేళ్లలో కేటీఆర్ ఏం చేశారో చూసుకొని తమను ప్రశ్నించాలని మల్లు రవి తెలిపారు.
