
రాజకీయ పార్టీలు పనిప్రదేశాలు కావు
రాజకీయ పార్టీలను పోష్ (POSH) చట్టం పరిధిలోకి తీసురావాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి, యజమాని సంబంధాలు లేనప్పుడు రాజకీయ పార్టీలు అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని 2022లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలను విచారిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలను పోష్ (POSH) చట్టం పరిధిలోకి తీసుకురావడం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సాధనంగా మారుతుందని వ్యాఖ్యానించింది. ఆ పిటిషన్ ను తిరస్కరించింది.
రాజకీయ పార్టీలను పనిప్రదేశంగా ఎలా చూస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం జీతం లేకుండా ఒక రాజకీయ పార్టీలో పని చేయడం ఉద్యోగం కాదని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలను ఎలా పోష్ చట్టం పరిధిలోకి తీసుకొస్తామని వ్యాఖ్యానించింది. పిటిషనర్ యోగమయ కీలక వాదన కోర్టు ముందు ఉంచారు. చాలా రాజకీయ పార్టీల్లో మహిళలు క్రియాశీలక సభ్యులైనప్పటికీ, సిపిఎం మాత్రమే బయటి వారితో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. మిగిలిన పార్టీల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు లేకపోవడం కారణంగా ఎంతో మంది మహిళలకు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సహకారం అందడంలేదని ఆయన తన వాదన వినిపించారు. కానీ యోగమయ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. రాజకీయ పార్టీలను ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ 2013 పరిధిలోకి తీసుకువస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అది సాధనంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ తిరస్కరించింది.
సురక్షితమైన పని వాతావరణం ఉండాలని, మహిళల గౌరవాన్ని కాపాడాలని సూచించిన రాజ్యాంగాన్ని పాటించే పార్టీలకు చట్టం సమానంగా వర్తిస్తుందని పిటిషనర్ యోగమయ వాదించారు. కానీ ఆయన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు తమ వ్యక్తిగత కక్షను ఇలాంటి చట్టాన్ని ఉపయోగించి తీర్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఇదొక అస్త్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిని దుర్వినియోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
