Let's talk: editor@tmv.in
రాజకీయ పార్టీలకు ఈసీ షాక్‌!

రాజకీయ పార్టీలకు ఈసీ షాక్‌!

Venkatesh Balusula
20 సెప్టెంబర్, 2025

కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్టరై నిష్క్రియాత్మ‌కంగా ఉన్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా 474 పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆరు సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల వ్యవస్థను పార‌ద‌ర్శ‌కంగా మార్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 17 పార్టీలు, తెలంగాణలో 9 పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో మొత్తం గుర్తింపు పొందిన‌, పొంద‌ని పార్టీల సంఖ్య 2520 నుంచి 2046కు తగ్గింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు మాత్రమే గుర్తింపు కలిగి ఉన్నాయి.

ఎన్నిక‌ల సంఘం గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. ఆగస్టు 9, 2025న మొదటి దశలో 334 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 2019 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఆ చర్య తీసుకున్నారు. ఇప్పుడు రెండో దశలో 474 పార్టీలు రద్దయ్యాయి. దీంతో మొత్తంగా 808 పార్టీలు ర‌ద్ద‌య్యాయి. మరో 359 పార్టీలపై కూడా రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో 2022లో 111 పార్టీలు, 2023లో మరికొన్ని పార్టీల గుర్తింపు రద్దు చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 29ఏ ప్రకారం రిజిస్టర్ అయిన పార్టీలు ఆరు సంవత్సరాలు పోటీ చేయకపోతే రద్దు చేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి ఉంటుంది. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు చెప్తున్నారు.

రాజ‌కీయాల్లో చురుగ్గా లేని పార్టీల ర‌ద్దు ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తుంది. చాలా పార్టీలు రిజిస్టర్ అయిన తర్వాత నిష్క్రియంగా మారి, మ‌నీ లాండరింగ్, ప‌న్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్ప‌డుతున్నాయని ఆరోపణలున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చర్యలతో అటువంటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. బ్యాలెట్ పేపర్లలో అనవసర పార్టీలు తగ్గడంతో ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా ఉంటారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎన్నిక‌ల‌ ప్రక్రియ సుల‌భంగా మారుతుంది.

రాజకీయ పార్టీలకు ఈసీ షాక్‌! - Tholi Paluku